Friday, December 18, 2009

కాల్చండి కాని ఆలోచించండి!

రింగు రింగులుగా పొగలు వదులుతున్న మావారిని చూసి ఈయనతో ఎలా మానిపించాలి ఈ అలవాటు అని ఆలోచిస్తున్నానే కాని.....ఆ పొగ ఎన్ని సుడులు తిరుగుతున్నాయో అంతకు పదింతలు మనసున సుడిగుండాలై, మెదడులో రింగులై ఆలోచనలు నన్ను తిప్పేస్తున్నాయి!
అప్పుడొచ్చింది నాకు ఒక బ్రహ్మండమైన సూపర్ డూపర్ ఆలోచన, వచ్చిందే తడవు మార్కెట్ కి వెళ్ళి వెతికి వెతికి ఆఖరికి కొనుక్కొనివచ్చాను.తీసుకొని అయితే వచ్చాను కాని ఈ ప్రయత్నం ఎంతవరకు ఫలిస్తుందో కదా అన్న సంశయం మాత్రం నన్ను వీడలేదు,అయినా ప్రయత్నించి చూద్దాం అని నిర్ణయించుకుని సెంటిమెంట్ తో కొడదాం అనుకుని "ప్రేమనగర్" సినిమాలో వాణీశ్రీగారిని తలచుకుని ఆ మహానటి లెవెల్ లో మనం డైలాగులు చెప్పి నటించలేము (ఏ సీన్ అని ఆలోచించి బుర్ర చించుకోకండి...అదే తలకి గాయమై రక్తం వస్తుంటే అది గ్లాసులో పట్టి త్రాగమని హీరో గారికి ఇచ్చే సీన్ అన్నమాట) కాని రాసి పడేద్దాం ఈయనగారు చదువుకుని నాగేశ్వరావుగారిలా ఫీల్ అయిపోతారు అనుకున్నాను....అంత సీన్ లేదు అనుకుంటున్నారా? ప్చ్! ఏంచేయను చెప్పండి??
ఇంతకు ఏం చేసానో మీకు తెలియదుకదా....ఒక అందమైన అమ్మాయి బొమ్మ దాని హృదయం నుండి జ్యోతి వెలుగుతూ సంగీతం వినిపించే లైటర్ ని మావారికి పుట్టినరోజు కానుకగా ఇచ్చాను. అది ఒక్కటీ ఇచ్చి వుంటే బాగుండేది అప్పుడు నాపై వాణీశ్రీగారు పూనారు కదా! నటనరాక రచించాను నేను తెల్ల కాగితముపై ఈ తవిక(నా దృష్టిలో కవిత).......
"మీరు సిగరెట్లు ఎన్నైనా కాల్చండి!
ఈ లైటర్ ని ఉపయోగించండి!
కాల్చిన ప్రతిసారి ఆలోచించండి!
నా హృదయం రగులుతుందని గమనించండి!
మీ పుట్టినరోజున నా ఈకానుకను స్వీకరించండి!"
ఇంత చక్కగా వ్రాసి కవితా ప్రియులైన మావారికి లైటర్ తో పాటు కాగితాన్ని కూడా అందించాను. కవిత చదివి చలించిన(అలా అనుకుంటే నాకు అదో తృప్తి లెండి)మావారు లైటర్ వెలిగిస్తే అందులో నుండి గాలి తప్ప జ్యోతి రాదుగా ఎందుకంటారా! అందులో గ్యాస్ లేదుగా ఆ వస్తువు ఇంపోర్టెడ్ దిగా......ఇది పదేళ్ళ క్రితం నాటి సంగతి! అప్పటి నుండి మావారు ఇప్పటికి వెయ్యిన్నొక్కసారి సిగరెట్టు మానేయడం జరిగింది.దానికి పదింతలు నా తవికని, కానుకని చూసుకుని మురుస్తూ రేపటినుండి మానేస్తాను అని అనడం నేను ఆయనతో మానిపించడానికి ప్రయత్నించడం రొటీన్ అయిపోయింది.
అన్నట్టు డిసెంబర్ 19న మావారి పుట్టినరోజు....అందుకే నా ఈ స్మృతిపదాన్ని మీతో పంచుకున్నది. ఈసారి ఇంకో క్రొత్త ప్రయత్నంతో మావారికి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను.మరిన్ని స్మృతులతో మిమ్మల్ని మరో టపాలో కలుస్తాను.

Sunday, December 6, 2009

పేరులో ముప్పు!

అవి ఆయన అక్కడ నేను ఇక్కడ అంటే..... నేను వరంగల్ మావారు విజయవాడ దగ్గరలో ఉద్యోగాలను వెలబెడుతున్న రోజుల్లో అని అర్థమై ఉంటుంది కదండి!
మా వారికి "ఉత్తమవర్కాలిక్"(పని వ్యసనాపరుడు) అని బిరుదును ఇచ్చి వాళ్ళ ఆఫీసు వాళ్ళు సత్కరిస్తున్నారని లీవ్ దొరికితే రమ్మని చెప్పారు.యధావిధిగా నాకు లీవ్ దొరక్కపోవడం మావారికి నేను రావడంలేదని చెప్పడం అయిపోయింది.అక్కడితో అయిపోతే సృతిగా మిగిలేదికాదు కదండీ....
సరే ఎలాగో వెళ్ళడం కుదరలేదు కనీసం పుష్పగుచ్ఛాన్ని పంపి అయినా నా అభినందనలని తెలియ చెప్పాలనుకుని, మా ఆఫీసు నుండి ఆ ఊరు వెళుతున్న ఒక వ్యక్తికి మావారి ఇంటి అడ్రసు చెప్పి అందమైన పూలగుత్తితో పాటు గ్రీటింగ్ కార్డ్ కూడా విత్ లవ్ అని రాసి పంపించాను.ఆ వ్యక్తి దాన్ని వాళ్ళ క్వాటర్స్ లో మావారి పేరుతోనే ప్రక్కలైన్ లో ఉంటున్న మరొకరికి ఇవ్వడం అందులోను వాళ్ళావిడకు ఇస్తూ మాడం సార్ కివ్వమని పంపారంటూ చెప్పడం జరిగింది.
ఇక్కడ నేను ఈయనగారి నుండి ఎటువంటి సమాధానము రాకపోయేసరికి,అసలు ఈయనకి స్పందించే హృదయమే లేదనుకుని కనీసము థాంక్స్ అన్నా చెప్పలేదు ఇకనుండి మనము కూడా ఏమీ పంపొద్దు అని మంగమ్మశపధం మనసులోనే చేసేసుకున్నాను.రెండువారాల తరువాత మావారు రావడం నేను అలగడం,ఆయన బ్రతిమిలాడడం మధ్యలో అసలు ఏమి అందలేదని ఈయనగారు చెప్పడంతో ఇక్కడ కథ సుఖాంతం అయింది.
మావారి పేరే ఆయనకి వుండడం 41 క్వాటర్ ఈయనది 47 క్వాటర్ ఆయనది అవ్వడం పాపం అక్కడ శాపమైంది. అందులోను వాళ్ళావిడ నెలరోజుల ముందే ఆయనపై అనుమానంతో పుట్టింటికి వెళ్ళితిరిగి వచ్చిందట.....ఈ విషయం మాకు ఆరునెలకి తెలిసింది,కాని అక్కడ అప్పటి సీన్ ఎలావుండి వుంటుందో ఒక్కసారి ఊహించండి మీరు!! ప్చ్.....కొన్ని విషయాలు ఇలా వదిలేస్తేనే బాగుంటాయేమో!!

Thursday, October 29, 2009

కార్తీకపున్నమిన......కాంతతో కబుర్లు!

పది అవుతుంది వాళ్ళు వచ్చే టైం అయింది అమ్మాయికి జ్వరం చూస్తే ఇంకా తగ్గలేదు అని అమ్మ అన్నమాటలకి, అంత దూరం నుండి వస్తున్న వారిని కాదంటే ఏంబాగుంటుంది చెప్పు! రానీ చూసి వెళతారు అన్న నాన్న మాటలతో నాకు మెలుకువ వచ్చింది. మెల్లిగా లేచి ఓపిక చేసుకుని ముఖం కడుక్కొని తయారు అయ్యేసరికి వాళ్ళు రానే వచ్చారు. హాల్లో కూర్చున్న వాళ్ళతో నాన్నగారు అమ్మాయికి జ్వరం అని అంటే ఎవరో పెద్దాయిన పర్వాలేదు చూస్తాంలెండి అమ్మాయిని రెండునిముషాలు వచ్చి కూర్చోమనండి అన్నమాటలతో నన్ను హాల్లోకి తీసుకుని వెళ్ళి కూర్చో పెట్టారు. ఇద్దరు ఆడవాళ్ళు, ముగ్గురు మగవాళ్ళు.... వాళ్ళ ఎదురుగా నేను. రెండు నిముషాల తరువాత లేచి వెళుతూ నూనూగు మీసాలు, నల్ల ప్యాంట్, తెల్ల చొక్కాతో కూర్చున్న పాతికేళ్ళ యువకుడు పదహారేళ్ళ కుర్రాడిలా కనిపించాడు (బహుశా జ్వరం కళ్లకి అలా కనపడి ఉంటారు) ఈయనగారికి ఇప్పుడే పెళ్ళికి తొందరేమిటో అనుకుంటూ ఆయనవైపు ఒక లుక్కిచ్చి లోనికి వెళ్ళాను. నా లుక్కు ఆయనగారికి లైక్ అయినట్టుంది మా మారేజ్ లుక్స్ ఫినిష్, పెళ్ళి డిసెంబర్ నెలలో ఫిక్స్.
ఆరోజు కార్తీకపౌర్ణిమ ఇంట్లో సాయంత్రం నోములకి మధ్యాహ్నం పిండివంటల్లో అమ్మకి సహాయము చేస్తుంటే ఎవరో పాతికేళ్ళ టిప్ టాప్ కుర్రాడు మెయిన్ డోర్ తీసుకుని లోనికి వచ్చి మా గుమ్మం దగ్గర నిలబడి ఏదో అడగబోతుంటే, నేను మా ఇంటి పై పోర్షన్ లో వుంటున్న బ్యాచిలర్స్ కోసం వచ్చిన బాపతు అనుకుని పై వాళ్ళు
వరూ లేరండి అని చెప్పినా ఇంకా ఆ అబ్బాయి అక్కడి నుండి కదలకపోయేసరికి అమ్మ వచ్చి ఎవరు కావాలని అడగడంతో ఆయనగారికి ఏమిచేయాలో తోచక బయటికి వెళుతుంటే, బజారునుండి చెల్లి వస్తూ ఆయనని చూసి మీరా! రండి అంటూ లోపలికి ఆహ్వానిస్తూ అమ్మకి అతను కాబోయే బావగారు అంటూ గుర్తుచేసింది. అమ్మ తను గుర్తు పట్టలేదని మన్నించమని లోపల కూర్చోమంది. నేను వంటింట్లోకి దూరి పని చేసుకుంటూ అదేవిటి గుర్తుపట్టలేదని కాస్త ఫీలౌతూ ఎలా గుర్తు పడతాను అప్పటికన్నా కాస్త ఒళ్ళుచేసి (నన్ను తలచుకుని) స్మార్ట్ గా ఉంటే అనుకున్నాను. తను ఏదో ఆఫీసు పని మీద వచ్చానంటూ ఎలాగో వచ్చాను కదా చూసిపోదామని ఇలావస్తే ఎవరూ గుర్తుపట్తలేదని చెల్లి దగ్గర వాపోయారు. అసలు విషయం అదికాదని నన్నుచూసి మాట్లాడాలని దానికి ఆఫీసు పని ఒక వంకని వింటున్న అందరికీ తెలుసు. పాపం ఆకోరిక తీరకుండానే పెళ్ళి అవుతుందని ఆ క్షణాన్న అలా చెబుతున్న ఆయనగారికి మాత్రం తెలియలేదు.
ఎందుకంటే రాత్రి పూజ అయ్యేసరికి ఆలస్యం అవటం కతికితే అతకదని కాస్త ప్రసాదం తీసుకుని ఈయనగారు వెళ్ళిపోవటం, వెళుతూ నన్ను పట్టుచీరలో చూసి మైమరచి నా ఆఫీసు అడ్రసు అడగక, తన ఫోన్ నంబర్ ఇవ్వక మరునాడు నా వివరాలు ఎవరినీ అడగలేక బిడియపడడం, నేను ఎలాగైనా కలుస్తారులే అని అఫీసు దగ్గర ఎదురుచూడడం, నన్ను చూడకుండానే ఈయనగారి తిరుగు ప్రయాణం.... వెరసి ప్రతీ కార్తీకమాసంలోను ఈ విషయాన్ని గుర్తు చేసుకోవడం, ఈ సారి మాత్రం కాస్త వెరైటీగా మీ అందరితో సృజన సృతులని పంచుకోవడం.........

Saturday, September 5, 2009

క్యాంటీన్ కాఫీ...కడుపు కలాస్!

పెళ్ళైన తరువాత మొదటిసారి అత్తగారింటికి నేను వెళితే అది రొటీన్ కానీ మావారు వెళితే వెరైటీ అనను కానీ వింత అని మాత్రం అంటాను...... ఎందుకనంటారా?
డిసెంబరు నెలలో పెళ్ళిచేసుకుని మంచి రొమాంటిక్ మూడ్ లో నన్ను తీసుకుని నెలలో అత్తగారింటికి బయలుదేరిన మావారి అవస్తలు అలాంటివండి. బయలుదేరితి పొమ్ము....రిజర్వేషను కంఫాం కాకుండా కంపార్ట్మెంటులో నాతోకలసి కాలు పెట్టనేల! పెట్టితిరిపొమ్ము టీ.సీ కి నాలుగు పాతికలు కొట్టనేల, కొట్టిరికదా అని టీ.సీ చెరొక కంపార్ట్మెంట్లో బెర్త్ లు ఇవ్వనేల, ఇచ్చిరి కదా అని ఆదమరచి నిదురించక అక్కడ ఆయన ఇక్కడ నేను ఆలోచిస్తూ జాగారము చేయనేల?
హమ్మయ్య! ఇక్కడితో ఆగిపోయిందనుకుంటున్నారా? అంత ఈజీగా మిమ్మల్ని వదివేస్తానా చెప్పండి..... తెల్లవారుజామున ఆరుగంటలకి చేరవలసిన రైలు ఎక్కడో గూడ్స్ పట్టాలు తప్పితే ఇక్కడ మా ఎడబాటుని చూడలేక మా రైలు పదిగంటలు ఆలశ్యాన్ని ప్రకటించి మమ్మల్ని ప్రొద్దున్నుండి సాయంత్రంవరకు మాట్లాడుకోమని వదిలేసింది. పొద్దున్నే కాఫీ కడుపులో పడనిదే కబుర్లాడని మావారిపై కేసముద్రంలోని రైల్వే క్యాంటీన్ వాడు కనికరించి కషాయానికి కాస్త ఎక్కువ రుచిగల కాఫీని అందించాడు. అదే మహాభాగ్యమనుకుని తాగిన వారందరితో పాలు అయిపోయినవి అంటూ మరోసారి కాఫీ అడిగినవారికి చిక్కని కాఫీలాంటి చక్కని సమాధానమిచ్చి చల్లగా జారుకున్నాడు.
ఇక్కడ మావారికి కాఫీ కడుపులోకి వెళ్ళి ఖాళీగా ఉండి ఏమిచేయాలో తోచక పేగులతో అనుబందాన్ని పెనవేసుకుని కడుపుని నులిపెట్టి మెలిపెట్టి పదినిముషాలకి ఒకసారి మావారిని టాయిలెట్ కి వెళ్ళేలా చేసింది. ఇంచుమించు కాఫీ తాగినవారిలో చాలా మంది పరిస్థితి అంతే, కాస్త మావారి పై ప్రేమ అధికమై వాంతులకి కూడా దారి తీసింది. పరిస్థితి విషమించక ముందే అక్కడి లోకల్ డాక్టర్ గారి రెండు సెలైన్ సీసాలు, మూడుమాత్రలు, నాలుగు గంటల అవస్థతో కడుపు మొత్తం ఖాళీ అయి కాస్త సర్దుకుంది. నాలుగు గంటలు మావారి విశ్రాంతి, మరో రెండుగంటలు "క్యాంటీన్ మరియు రైల్వే సిబ్బంది" అనే విషయం మీద ఇష్టాగోష్టితో పదిగంటలు గడిచిందంటూ రైలు పరుగు తీసి సాయంత్రానికి గమ్యాన్ని చేర్చింది.
అక్కడ అల్లుడు అడుగిడుతున్నాడని అలకపానుపు ఎక్కనీయరాదని అత్తగారు అరిసెలు, సున్నిఉండలు లాంటి పిండివంటలతో ఆనందింప చేయాలని ఆయాసపడి అమర్చినవన్నీ ఉన్న నాలుగు రోజులు ఒట్టి మజ్జిగన్నం తిని సేదతీరిన ఈయనగారిని చూసి చప్పబడ్డాయి....అల్లుడిగారిని కాస్త అవి ఇవి తిని గట్టిపడమని చెప్పవే అంటూ అమ్మ సలహాలు, అక్కా...బావ మరీ ఇంత సుకుమారుడా! అంటూ చెల్లెళ్ళ చలోక్తులు, మావారి అవస్థలు........మరుసటి నెలలో మొదటి పండుగకి వచ్చినప్పుడు తీరినవి అందరి అచ్చటా ముచ్చట్లు!!!

Sunday, August 23, 2009

అమ్మవారికి అర్చన!!

పద్దెనిమిదేళ్ళ క్రిందటి మాట......ఆ సంవత్సరం వినాయక చవితి విజయవాడలో చేసుకుని సాయంత్రం విహారానికి కృష్ణ బ్యారేజ్ మీదకి వెళ్ళి అలాగే అమ్మవారి దర్శనం కూడా చేసుకుందామని వెళ్ళిన మాకు ఎదురైన చేదు అనుభవం! అందరూ ఇలా ఉంటారని కాదు కాని చాలా భాధని కలిగించిన విషయం.....
ఇంద్రకీలాద్రి పైవున్న అమ్మవారిని దర్శించుకోడానికి రహదారిన, వాహనంలో కాకుండా మేము వెనుక వైపున వున్న మెట్లపై నుండి మెల్లగా నడచుకుంటూ వెళుతున్న మాకు రోడ్డుకి ఇరుప్రక్కల నుండి కొబ్బరికాయలు, పూలు, కుంకుమ కొనుక్కోండి...రండమ్మా! అన్న పిలుపులతో మాకు మాతా( అమ్మవారి) దగ్గర మంచి మార్కులు కొట్టేయడానికి కుంకుమార్చనయే మార్గమని తలచి వందగ్రాముల కుంకమ ఇవ్వమన్నాం.....కుంకుమతో పాటు చీరకట్టించండి అమ్మవారి కరుణాకటాక్షాలు మీ సొంతమంటూ ఒక బుట్టలో పూలు, కొబ్బరికాయ, చీర, ఒక కాగితపు పొట్లం, అగరొత్తులు, హారతి కర్పూరంతో పాటు అరడజను ఎర్రగాజులు ఇచ్చి రెండువందలయాభై తీసుకుంది. వాటిని తీసుకుని నేను మావారితో పైకి మెట్లెక్కుతూ......మెట్లకి పసుపు రాస్తూ కుంకుమ బొట్లు పెడుతున్న భక్తులని చూస్తూ వీళ్ళంత పుణ్యం కాకపోయినా కుంకుమార్చనతో కాసింతైనా రాకపోతుందాని ఆలోచిస్తూ ఆనందంగా పైకెక్కి అర్చనతో పాటు స్పెషల్ దర్శనానికి టిక్కెట్ తీసుకుని గుడిలో పూజారికి కుంకుమార్చన చేయమని చెప్పి పళ్ళెంలో పదిరూపాయిలు వేస్తే మమ్మల్ని లోపల ప్రక్కకి నిలబెట్టి పదినిమిషాల తరువాత ప్రత్యేకమైన శ్రధ్ధతో అర్చన చేయిస్తూ కుంకుమ పొట్లం విప్పి పళ్ళెంలో పోస్తూ పూజా సామాగ్రిని మీరు దేవస్థానం వారి దుకాణంలో కొనలేదా! అని మావైపు జాలిగా చూసి కాగితం పొట్లాన్ని పూజారి మాకు చూపిస్తూ ఎప్పుడూ బయట కొనకండి ఇలాగే మోసం చేస్తారు అని చెప్పారు....అందులో మెత్తని ఇటుక పొడిని అదిచూసి నా మనసు ఎంత భాధ పడిందంటే నేను ఇప్పటికీ దుర్గగుడికి వెళితే అర్చన చేయించడం కాని కొబ్బరికాయ కొట్టడం కాని చేయను, హుండీలో వాటి తాలూకు డబ్బులు వేసి దణ్ణం పెట్టుకుంటాను. నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం కుంకుమ విషయంలో ఎందుకు ఆవిడ అంత మోసం చేసింది అని!!!
మావాళ్ళంతా మాత్రం మీ ముఖాలని చుస్తేనే వాళ్ళకి మోసం చేయ్యాలనిపిస్తుంది అంటారు.

Sunday, August 16, 2009

రెండు రెండ్ళ ఆరంగుళాలు...

ఆదివారం అందరం హాయిగా భోజనాలు చేసి మధ్యాహ్నం టీవీ లో "ఆ ఒక్కటీ అడక్కు" సినిమాని సీరియస్ గా చూస్తుంటే....మా వారికి వాళ్ళ చెల్లికి తనపై మునపటి గౌరవం ఉందో లేదో అన్న అనుమానం మొలకెత్తి మూడున్నర అయినా ఇంకా టీ పెట్టడానికి లేవని మా అందరి మొహాలకేసి చూస్తూ లేదు అని ఫిక్స్ అయిపోయారు....మమ్మల్ని చూసి చెల్లెలికి లేదు అని ఎలా ఫిక్స్ అయ్యారని అడక్కండి విశదీకరిస్తే నాకూ లేదంటారు గౌరవం అందుకే గప్ చుప్....
అయిదు కావస్తుంటే సినిమా అయిపోయాక టీవీని కట్టేసి టీ కప్పుని అందించిన చెల్లికి గౌరవమేకాదు ప్రేమకూడా ఉంది అని నిర్ణయించుకుని దాన్ని నిర్ధారించుకోవడానికి చెల్లీ! రేపు పెళ్ళి వుంది మొన్న నేను కుట్టించుకున్న ప్యాంట్ రెండు అంగుళాలు పొడవు ఎక్కువ అయింది మన టైలర్ దగ్గరకి వెళితే వారం చేస్తాడు కాస్త కత్తిరించి కుట్టి పెట్టవా.... అని అడిగిన దానికి అలాగే అని తలవూపి నాతో వదినా! నేను నా స్నేహితురాలి ఇంటికి వెళ్ళివస్తాను అన్నయ్య చెప్పిన పని కాస్త నీవే చేయమంది. నాకు రాత్రికి భోజనానికి చుట్టాలు వస్తున్నారు పనివుంది కుదరదని వీలున్నప్పుడు చేద్దాం కాని నీవు వెళ్ళిరమ్మని పనిలో మునిగిన నాకు చెల్లికి అన్నగారిపై గౌరవంతో పాటు అభిమానం కూడా మెండు అని తెలియలేదు. తను అయ్యో అన్నయ్య చెప్పాడు కదా అని ప్యాంటుని రెండు అంగుళాలు కత్తిరించి కుట్టి ఇస్త్రీ చేసి బీరువాలో పెట్టి వెళ్ళింది.
వంట చేస్తున్న నాకు అత్తగారు చుట్టాలు రాత్రి భోజనానికి రావడం లేదు అన్న మాటలతో మొత్తం పని అయిపోయి ఖాళీగా వున్నాన్న ఫీలింగ్ లో ఈయన గారిపై ప్రేమ మరింత ఎక్కువై ఆయనగారి పనిని మక్కువతో చేద్దాం అనుకుని బీరువాలో నుండి ప్యాంటుని తీసి రెండు అంగుళాలు కత్తిరించి కుట్టి బీరువాలో పెట్టాను. ఇది తెలియని మావారు తన చెల్లి ఆ పని చేయలేదని తమ్ముడ్ని పిలిచి వెళ్ళి ఎవరైనా టైలర్ తో దగ్గరుండి కుట్టించుకు రమ్మని బీరువాలో నుండి ఆ ప్యాంటుని తీసి సీరియస్ గా ఇచ్చేసరికి మా మరిదికి మ్యాటర్ ఈస్ మచ్ సీరియస్ అని మరో రెండంగుళాలకి ప్యాంటుని కుదింపచేసి వాళ్ళ అన్నగారిని కూల్ చేసాననుకున్నాడు. పాపం వాడికేం తెలుసు ఆ వెయ్యిరూపాయిల ప్యాంట్ వేసుకోవడానికి వారికి పొట్టిదై నిక్కరుకి కాస్తపొడుగై ఆఖరికి అది ఇంట్లో వేసుకునే బర్ముడా అయిందని......

Wednesday, August 12, 2009

భర్త, భార్య అండ్ బైక్....

మేఘాలలో తేలిపొమ్మన్నది... తూఫానులా సాగి పొమ్మన్నది అమ్మాయితో......
నాతో పెళ్ళైయ్యాక ఇంక ఏ అమ్మాయితో సాగిపోయే అవకాశం లేక మావారు నాతోనే ఇలా సాగిపోవాలనుకున్నారు...అదేనండి లాంగ్ డ్రైవ్ విత్ గర్ల్ ఫ్రెండ్ కాదు కాదు విత్ వైఫ్....ఆయన కోరిక అందులో నాకు మహాసంబరం అలా బైక్ పై వెళ్ళాలని, కాని అప్పట్లో మాకు బైక్ లేదు అందుకే ఆయన వాళ్ళ ఫ్రెండ్ బైక్ తీసుకుని వస్తే దానిపై అన్నవరం అక్కడనుండి వైజాక్ బీచ్ (పుణ్యం, పురుషార్ధం రెండు కలసివస్తాయని) ప్లాన్ వేసారు.......
ఉదయం 5గం' లకి రాజమండ్రి నుండి బైక్
టాంక్ ఫుల్ చేయించుకుని బయలుదేరితే గంట ప్రయాణానికే అలసిన బైక్ కాస్త విశ్రాంతి కోరింది. ఏదో పాపం అది మాఇద్దరిని కాసేపు మాట్లాడుకో మని అవకాశం ఇచ్చింది కాబోసు ఎంతైనా రొమాంటిక్ బైక్ అనుకుని పావుగంటాగి బయలుదేరాము. దారిలో గొర్రెలమందని చూసి దానికి మరి ఏం గుర్తుకువచ్చిందో మరో పదినిముషాలు ఆగింది. రోడ్డుకి ఇరువైపులా పచ్చని చెట్లు మావారు పాటందుకుందామని మనసులో అనుకున్నారో లేదో డుబ్...డుబ్... మంటూ చక్కని సైలన్సర్ సౌండ్ తో బైక్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇస్తూ ఆగింది. అదేవిటండి మీరు ఇంకా పాట అందుకోనేలేదు నేను దానికి స్వరము కలపక ముందే ఆగిపోయింది ఏవిటండీ అంటే!! ఏమో! పచ్చదనాన్ని చూసి బైక్ టాంక్ వేడెక్కినట్టుంది కాసేపాగి వెళదామంటూ మంచినీళ్ళ సీసాని ఎత్తింది దించకుండా గడగడా తాగారు. కాస్త దూరం వెళ్ళాక ఊళ్ళోకి వెళితే టీకొట్టు ప్రక్కన వేడి వేడి అట్లు వేస్తూ అవ్వ ఆహ్వానిస్తే ఆకలికి ఆగలేక మావారు అరడజను అట్లు ఆరగించి బైక్ ని ముందుకి పొమ్మంటే మీరు తిన్న అట్లబరువుని మోయడం నావల్లకాదంటూ మొరాయించింది....అదికాదులెండి! చెట్టుక్రింద వున్న తుమ్మముల్లుని ముద్దాడి పంచరైంది.....అదేనండి చిల్లుపడి గాలిపోయింది. పంచరు వేసి గాలి కొట్టించి బైక్ ని బుజ్జగించి బయలుదేరేసరికి సమయం పదిగంటలు. అంతా సవ్యంగా జరిగివుంటే అప్పటికి అన్నవరంలో వుండేవాళ్ళం. బైక్ ని కాస్త మెల్లగానే నడపండి ఎందుకంటే మళ్ళీ అలుగుతుందేమో అని ఈయనతో మెల్లగా అని బైక్ కి పాత పాటలు ఇష్టమేమోనని "తలచినదే జరిగినదా దైవం ఎందులకు" అని గొంతు ఎత్తాను అంతే ఛా వీళ్ళకి అస్సలు మ్యూజిక్ సెన్స్ లేదంటూ మూలుగుతూ బైక్ ఆగిపోయింది........ఏమని చెప్పను! పెట్రోల్ అయిపోయిందండి! బైక్ ని తోసుకుంటూ దాని ఆకలి తీర్చేసరికి నాకు నీరసం ఆయనకి ఆయాసం ఒకరిపై ఒకరికి కాస్త విసుగుతో కూడిన చిరాకు. ఎలాగైతేనేం అన్నవరం చేరుకునేసరికి ఒంటిగంట ఇక్కడ మాకు కడుపులో మంట......ఎదురుగా గుడి తలుపులు మూసుకున్నాయి, అవి మూడు గంటలకి తెరుచుకుంటాయంట!
దేవుడి దర్శనం అయినతరువాత ఇంక వైజాక్ బీచ్ లో బైక్ విన్యాసాలు ఏమి చూస్తాములెండి అంటూ తిరుగు ప్రయాణం అయ్యాము. ఓహో! భలే భలే ఇంటికి త్వరగానే వెళుతున్నాము అని హుషారుగా బయలుదేరిన బైక్ గంట పయనించి చిన్ని గుంతలో కూలబడింది ఏవిటని నన్ను అడగకు అంటూ ఈయన నాలుగడుగులు వేసి బైక్ ని నలుగురి సహాయముతో లారీలో వెనుక దాన్ని ఎక్కించి ముందు మేము కూర్చుని ఇంటికి చేరేసరికి రాత్రి పదిగంటలు......
(బైక్ అంతకు ముందు నెలరోజులనుండి మెకానిక్ దగ్గరే వుందట! స్నేహితుడు అడగక అడగక అడిగాడు కదా అని ఆయనగారి మంచి మిత్రుడు బైక్ ని మెకానిక్ దగ్గర నుండి ప్రయాణానికి ముందు రోజు హడావిడిగా రిపేర్ చేయించి ఇచ్చారంట! అది ఒక లీటర్ పెట్రోల్ ఒక కిలో మీటర్ ప్రాతిపధిక మీదనే పని చేసేదట! ఇంకా మామీద అభిమానంతో అలా సర్దుకుని పోయిందట! అదీసంగతి..)

Monday, August 3, 2009

మావారి మీసాలు...

నాకు చిన్నప్పటి నుండి తాతగారిని, నాన్నని మీసాలు లేకుండా చూసి మగవారు మీసాలు లేకపోతేనే మగధీరులు అన్న అభిప్రాయం....దాన్ని ఉత్తరాది హీరోలు అమితాబచ్చన్ గారి అందమైనమోము, రాజేష్ ఖన్నాగారి రొమాంటిక్ అంతా ఆ మీసాలు లేకపోవడంవల్లనే అన్న అభిప్రాయాన్ని అప్పట్లో గట్టిపరిచాయి. ఇది ఇలావుంటే మాపెద్దమ్మ వాళ్ళ మనవళ్ళకి భోజనం తినిపిస్తూ మీరు అన్నం తినకుండా అల్లరిచేస్తే గుబురు మీసాల బూచాడు ఎత్తుకెళ్ళిపోతాడు అని భయపెట్టి తినిపించడంతో నేను నిర్ణయించేసుకున్నాను మీసాలు వున్నవారు బూచాళ్ళని, మీసాలు లేని వారు మంచి మనసున్న మగధీరులని..(మీసమున్న వారంతా నన్ను మన్నించాలండి). తరువాత కాలేజీలో ఫ్రెండ్స్ మధ్య వాదోపవాదాలు జరిగినా మా గ్రూప్ దే(మీసాలు లేని) పై చేయి.....
ఆ అభిప్రాయంతో అల్లుకుపోయిన నా యుక్తవయసుకి పెళ్ళిచూపుల్లో మావారి మీసకట్టుతో కళ్ళెం పడింది.."నా మనసుకి నచ్చిన ఈ మగవానికి మీసమేల!!! అని పరి పరి విధముల మనసు ఘోషించినను.... ఆ ఏమున్నది మెల్లగా బ్రతిమిలాడి, బుజ్జగించుకుని నాదారికి మళ్ళించుకుందునులే అని తలవంచి తాళి కట్టించుకుంటిని"....
అసలు కధ అప్పుడు మొదలైంది...మావారికి మీసాలంటే మహా మోజు, మీసాలులేని వాడు మగాడే కాదంటారు (మీసాలు లేని వారు మావారిని మన్నించాలండి), క్రమంగా మావారి ప్రేమలో నాకు మీసాలపై మక్కువ పెరిగితే, నా ఆలన ఆయనలో మీసాలపై అభిప్రాయాన్ని మార్చింది. ఈ విషయం మా పెళ్ళిరోజున మాకు తెలిసింది.
పెళ్ళిరోజున మావారికి బహుమతిగా ఆయన ఫోటోని పెద్దదిగా లామినేట్ చేయించి, నా వాలు జడలోని కాస్త ముక్కని కత్తిరించి, ఆయన ఫోటోలోని మీసాలకి అందంగా అతికించి, ఫోటోపై
"మీకు మీ మీసాలే అందం...
మీ ప్రేమతో నాకు వాటిపై పెరిగింది అనురాగం...
మీ మోముపై అవి మెరవాలి కలకాలం...

మీ శ్రీమతి ప్రేమతో ఇస్తున్న బహుమానం..."
అని కవిత్వాన్ని(నా దృష్టిలో కవిత్వమనే అనుకుంటూ) రాసి ఫ్రేం కట్టించి ప్యాక్ చేయించి ఆయన కోసం ఎదురుచూస్తుంటే....తెల్లవారింది, ఉదయం నాలుగు గంటలు...ట్రింగ్ !!! ట్రింగ్ మని కాలింగ్ బెల్ మ్రోగింది ఈయనే వచ్చివుంటారు విజయవాడ నుండి ముందుగా నేనే విష్ చేయాలని ఎంతో ఉత్సాహంతో తలుపు తీసిన నాకు గుమ్మానికి ఎదురుగా ఆరడుగుల విగ్రహం....పరిచయమున్న ముఖమే కాని కొత్తదనంతో, కొద్ది
క్షణాలు గుర్తుపట్టలేకపోయాను....ఒసేయ్ పిచ్చి మొహమా నేను అంటూ మావారు మీసాలు లేకుండా......

Thursday, July 16, 2009

ఆషాడం అవస్తలు.....

మురళీగారి "ఆషాడమాసాన" టపా చదువుతున్నాను, పూర్తి అయ్యేసరికి నా కంటి ముందు నలుపురంగుపై తెల్లని చక్రాలు గిర్రు గిర్రున తిరుగుతుంటే వాటికి అంతరాయం కలిగిస్తూ మావారి గుర్రు....గుర్రు!! అయినా! చక్రాలకి కొత్తకాని నాకిది అలవాటే....అమ్మో ఏంటి ఇలా అన్నీ ఏకరువు పెట్టేస్తున్నాను....మావారికి దిష్టి తగులకుండుగాక!!!
మమ్మల్ని కూడా ఆషాడ విరహం అనుభవించమని గవర్నమెంటువారు శని ఆదివారాలతో ఒకరోజు సెలవు ఇస్తే నేను రెండువేసి మొత్తం ఐదు రోజులు మా పుట్టింటికి చెక్కేసాను... ఈ అవకాశం మరల మరల రాదు అనుకున్న (అదికాదులెండి మిమ్మల్ని చూడకుండా వుండలేక అంటారా!....ఏవండీ అలా నిజాలని మరీ బయటపెట్టేయకండి!!!) మావారు రెండవ రోజే అత్తగారింటికి అర్థరాత్రికి అరగంట ముందుగా అడుగుపెట్టబోయారు........అమ్మాయ్! అబ్బాయిని అడుగు ముందుకు వేయకుండా ఆపు అని లోపలినుండి అమ్మ అరుపు, అది విని మావారు ఆగిపోయారు కాని నేను ఆగలేక అడుగు బయటికి వేసి అరుగుపై కూర్చుని కాదు కూర్చోమని అడిగాను....ఏవిటండి మాటైనా చెప్పకుండా వచ్చేసారని.....
పిచ్చిదానా! మనం కూడా ఆషాడంలోని అవస్తల్ని అనుభవిద్దాం అన్నారు..... దానికి అర్థం నాకు గంట తరువాత ఆయన నడుముకి జండూబాం రాస్తున్నప్పుడు అర్థమైంది.
మీకు అర్థం కాలేదా?
కావాలంటే చదవండి.....
ఆషాడంలో అత్తగారింటి గడప దాట కూడదు కాని గోడ దూకవచ్చునంట! అని అమెరికాని కనుక్కున్న వాస్కోడిగామా లెవల్ లో చెప్పారు. ఏదైతేనేమిలెండి! వచ్చారుగా విచ్చేయండి అన్నాను అర్థరాత్రి ఎక్కడికి వెళతారులే అని. అప్పుడు నాకు తెలియలేదు ఆయనకి అమ్మాయిల ఇంటి గోడదూకి సైటు కొట్టి నడ్డి విర్గొట్టించు కోవాలనే కోరిక చాలా కాలంగా వుందని దాన్ని ఇలా తీర్చుకున్నారని....కాంపౌండ్ గోడని ఎవరెస్ట్ పర్వతం ఎక్కిన ఫీలింగ్ లో ఎక్కారు, ఎక్కితే పర్వాలేదు దిగడం మాటో! దిగలేదు దూకారు.........
పర్యవసానం నడుము దగ్గర బెణుకుడు.
అదృష్టం బాగుండి ఏకాలోచెయ్యో విరగలేదు, అయినా అబ్బాయికి ఇలాంటి విచిత్రమైన కోరికలేవిటే అంటూ అమ్మ వేడినీళ్ళు పెడుతూ వంటింట్లో గొనుగుడు. మీకెందుకొచ్చిన అవస్త
చెప్పండి అంటూ నేను ఆయన నడుముకి మందు రాసి కాపడం పెడుతూ..నసుగుడు.
మనం సొంత ఇల్లు కట్టించుకున్నప్పుడు గడపలే పెట్టించు కోవద్దంటూ మావా
రు నా చెవిలో కొరుకుడు.
అదండీ అలనాటి ఆషాడం అవస్తలు.....

Friday, July 10, 2009

ప్రియమైన శ్రీవారికి....

అప్పట్లో "శ్రీవారికి ప్రేమలేఖ" చిత్రం చూసాక నాకు ఒక చిత్రమైన కోరిక కలిగిందండి....
ఎవరికైనా అలా నేను కూడా ఒక లేఖ వ్రాయాలని దానికి స్పందన అందమైన జవాబు రూపంలో నా ముందుండాలని....
కోరికైతే బాగానే ఉంది కాని దానికి సరి అయిన వ్యక్తి తారసపడలేదు, వెదికి పట్టుకునే తీరిక ధైర్యము మనకి అంతకన్నా లేవు....అలా ఆ కోరిక తీరకుండానే పెళ్ళైపోయింది.
వరంగల్లో ఉద్యోగం వెలగబెడుతున్న రోజుల్లో...సంధ్యారాగం చంద్రహారతి పడుతున్న వేళ, మసక చీకటి మధ్యమావతి పాడుతున్న వేళ ఆ శుభముహుర్తంలో మళ్ళీ నాలో ఆ పాత కోరిక చిగురించింది...చిగురించిందే తడవు మనకి కొదవేమిటి చెప్పండి! తీసాను ఒక అందమైన గులాబి పువ్వున్న లెటర్ పాడ్ రాసాను పుంఖాను పుంఖలుగా నాలోని భావాలకి అక్షర రూపాలనద్ది......తొలిసారి ఆయన్ని చూసింది మొదలు, ప్రేమించి బుట్టలో పడ్డానని కాస్త...కాస్త ఏమిటి పావలాకి రూపాయి అంత యాక్షన్ లెవెల్ లో రాసిపడేసాను, కాదు కాదు పొస్ట్ చేసేసాను!
తరువాత ఆఫీసు పని ఒత్తిడిలో ఆ లేఖ విషయం మరచిపోయాను.వారం రోజుల తరువాత సాయంత్రము ఇంటికి వచ్చి ఇంటి తాళం తీసి లోపలికి అడుగు పెట్టగానే పాదాల దగ్గర లేతాకుపచ్చని రంగున్న కవరు కంటపడింది.అప్పుడు గుర్తొచ్చింది నేను వ్రాసిన ఉత్తరానికి అది ప్రత్యుత్తరమని....ఆత్రుతతో విప్పి చూసాను ఏమి వ్రాసివుంటారా అని!!!

అవే గులాబి పువ్వున్న కాగితాలు, అదే నా చేతితో వ్రాసిన పుంఖాను పుంఖల కాగితాలు.ఏమిటి టపా తిరిగి వచ్చింది అని చూసుకుంటే!! పచ్చని కవరుపై అడ్రసు నాదే వ్రాసి వుంది.కాగితాలని పరీక్షగా చుస్తే కనిపించాయి ఎర్రని సిరాతో వేరొకరి చేతిరాతలు నా వ్రాతలపైన........ ఎవరైన బడిపంతులుగారికి పోస్ట్ చేసానా ఏవిటి కొంపతీసి అనుకుని చివరి పేజీలో క్రింద చూస్తే వ్రాసి వుంది ఎర్రని సిరాతో "ప్రియమైన భార్యామణి ఇంత అందంగా ముత్యాలని మూటగట్టి నీవు వ్రాసిన ఉత్తరము చదవక మునుపే నిన్ను ప్రేమించాను కాని తమరు కాస్త అక్షర, వ్యాకరణ దోషాలని సరిచూసుకోండి" అని......ఇంకా ఏమి వ్రాసివుంటారబ్బా, అని ఆలోచిస్తున్నారా!!!ఛా...ఛా అలా ఎందుకు ఆలోచిస్తారు చెప్పండి మీరు!!

Tuesday, June 30, 2009

ఆషాఢం ఆఫర్!!!

ఆషాడమాసం వచ్చిందంటే నేను పైన సూట్ కేసులో నుండి నాకు మాశ్రీవారు కొనిచ్చిన చిలకాకుపచ్చరంగు పట్టుచీరని తీసి చూసుకోకుండా, శ్రావణమాసానికి చీరకొనుక్కోనండీ!! అని చెబితే మీరు నమ్మాలండీ.....ఎందుకంటారా?
సరే మరైతే ఇంకెందుకు ఆలశ్యం ఒక్కసారి నా సృతుల సవ్వడి వినండి మరి!!!

శనివారం విజయవాడలో బస్సెక్కి వరంగల్ వద్దామని బయలుదేరిన మావారు బస్సు ఇంకా బయలుదేరడానికి అరగంట పడుతుంది అని తెలిసి టీ తాగి ఒక దమ్ము కొడదామనుకుని బస్టాండ్ నుండి బయటికి వస్తుంటే "అయ్యగారండీ.....ఒక్కనిముషం" అన్న మాటతో వెనుదిరిగి చూసారు. ఒక ముప్పైఏళ్ళ వయస్సున్న యువతి నా దగ్గర రెండు కొత్త కంచి పట్టుచీరలు వున్నాయండి మీకు కావాలాండి అని అడిగిందట. నన్నే ఈవిడ ఎందుకు అడిగిందా అని ఆశ్చర్యపోతున్న (బహుశా మనసులో మురిసిపోతు) మావారి మనసునెరిగి ఆవిడ నా పర్సుని ఎవరో కొట్టేసారండి ఇప్పుడు నేను బస్సు ఎక్కి వెళ్ళకపోతే మళ్ళీ రాత్రి పొద్దుపోతుంది ఇంట్లో కంగారు పడతారు, షాపుకి వెళ్ళి తిరిగి ఇచ్చే టైము లేదు అందుకని మీకు నచ్చితే తీసుకోండి అంటూ రెండు అందమైన అమ్మాయిల బొమ్మలున్న అట్టపెట్టెలని చేతిలో పెట్టింది. అట్టపెట్టె మీది అమ్మాయిలే నచ్చారో లేక అందులోని చిలకాకు రంగు చీరే నచ్చిందో కాని ఆమె పదిహేను వందలు అనగానే ఇంకో మాట అనకుండా టక్కున డబ్బులు ఇచ్చేసి పట్టుచీరను చట్టుక్కున లాక్కొని చిటుక్కున బస్సెక్కేసారు......

ఇంటికి రాగానే ఏమోయ్! నీకోసం ఏం తెచ్చానో చూడు అంటూ నాకు అందించిన అట్టపెట్టెని చీర అని అంచనా వేసి...... భోంచేసాక చూస్తానులెండి మీరు అలసి పోయారు స్నానం చేసిరండి అంటూ వంటింట్లోకి వెళ్ళి హడావిడిగా హల్వా తయారు చేసాను.....ఎందుకనో మీకు వేరే చెప్పాలటండీ?(పట్టుచీర తెచ్చి నందుకు పాలిష్)....ష్ ష్... ఇలా నిజాలని బయట పెట్టకండీ!
భోజనాలు అయ్యాక పదిరోజుల్లో శ్రావణమాసం వస్తుంది కదా! అప్పుడు కట్టుకుంటానండి అంటూ చిలకాకుపచ్చకి ఎర్రని అంచున్న కంచిపట్టు కోకకి కొంగు ఎలావున్నదో కదా అని కోరికతో మడత విప్పిన నేను...చూస్తున్న మావారి నోటి నుండి ఒకేసారి ఆ!! అనే శబ్ధం చుట్టూ నిశ్శబ్ధం....


ఇదీసంగతి!....చిలకాకు పచ్చ రంగున్న పట్టుచీర కాదు పట్టు పరకిణీ అయినా బాగుండేది అదీ కాదు పట్టు బ్లౌస్ కి కాస్త ఎక్కువ టవల్ కి కాస్త తక్కువ అయిన ఎర్రంచు పట్టు పీలికని పేపర్ల పైన మడతపెట్టి పెట్టెలో పెట్టి....... ఇంక ఎందుకులెండి అసలు విషయం తెలిసింది కదా!!!!


Tuesday, June 16, 2009

శ్రీవారితో సినిమాకి!

అది పెళ్ళైన వారం రోజులనాటి సవ్వడండి........
ఏదో మావారికి కూడా అందరిలాగే వాళ్ళవిడతో సినిమాకి వెళ్ళాలని తెగ ముచ్చటపడి "చూపులు కలసిన శుభవేళ" సినిమా టిక్కెట్లు రెండు సంపాదించి నన్ను త్వరగా రెడీ అవ్వమని హాల్లో టీ.వి చూస్తూ కూర్చున్నారు. నేను తెగ సంబర పడిపోయి అత్తయ్యగారు అథితుల మధ్యలో ఉండగా ఈ కబురు చెప్పాను. ఆవిడ సరే అన్నారు కాని తొమ్మిదో తరగతి చదువుతున్న మా చిన్ని ఆడపడచు నేను కూడా రానా వదినా అంది, నాకు రెండు టిక్కెట్లు మాత్రమే వున్నాయనే విషయము తెలియక సరే రమ్మన్నాను. ఇది విన్న మా పెద్దాడపడచు పిల్లలు మేము మరీ అంటూ బయలుదేరారు. నా ఇద్దరు మరుదులు బేల ముఖంతో నిలబడితే నేనే వాళ్ళని కూడా రమ్మన్నాను. మేమేం పాపం చేసామంటూ మావారి మేనత్త పిల్లలు కూడా బయలుదేరారు.....పదండి! అంటూ అడుగిడిన నన్ను చూసి మురిసి పోయారో లేక నా వెనుక వున్న దండుని చూసి మూర్చపోయారో!....చూసేలోగా మావయ్యా పదా... అంటూ ఐదేళ్ళ మేనల్లుడు చేయిలాగేసరికి చేసేదిలేక పదండి అని కదిలారు.
తరువాత కధ మీకు తెలిసిందే..... ఆ సినిమాకి టిక్కెట్లు ఇంత మందికి ఇవ్వలేమంటూ ప్రక్క థియేటర్ లోని సినిమా కలక్షలని కాస్త పెంచమంటే ఆ పుణ్యకార్యం కూడా చేద్దాం పదా అనుకుని అందులో కూర్చున్నాము....సినిమా అప్పటికే మొదలై పావుగంట... మాలాగే టిక్కెట్లు దొరకని దురదృష్టవంతులతో హాలు నిండింది. నీతో సరదాగా సినిమా చూడాలి అనుకుంటే పిల్ల కోడిలా వీళ్ళందరినీ వెంటబెట్టుకుని బయలుదేరావా! అని అన్న మాటలకి సమాధానము చెప్పేలోపు.........అన్నయ్యా! చూడు నా ప్రక్క సీటు వాడి వెకిలి వేషాలు అంటూ ఫిర్యాదు. వెంటనే ఈయనగారు వెళ్ళి ఆ చివర కూర్చుంటే ఎనిమిది మంది ఎడమలతో ఈ చివర నేను. పిల్లలందరూ సినిమా చూస్తుంటే..... ఏడవలేక నవ్వుతూ ఈయన నన్ను చూస్తున్నారు.....నా ప్రక్కన కూర్చున్న చిన్నోడికి డౌట్లు చెప్పి ఈయన వైపు సినిమావైపు ముచ్చటగా మూడుసార్లు చూసేసరికి........తెరపై విశ్రాంతి.
అందరికి అల్పాహారాలందించి ఏదో గుర్తుకు వచ్చినట్టుంది నాకిష్టమైన మసాల బఠాణీల ప్యాకెట్టుని నాకివ్వమని ఆయన ప్రక్కనున్న చెల్లెలి చేతిలో పెట్టడము.....పిల్లలు అక్కడ తెరపై హీరో విలన్లని కుమ్ముతుంటే ఈ ప్యాకెట్టు చేతులు మారి నా చేతిలోకి వచ్చే సరికి వెల రు.15 అనే నూనె కాగితము, తెరపై గ్రూప్ ఫోటోతో సినిమా అంతము.
కొసమెరుపు: ఉదయం టిఫిన్ తింటూ పిల్లలందరూ వదిన మంచిదని, అత్తయ్య నాకు కావాలని,నా ప్రక్కన కూర్చోవాలంటే... నా ప్రక్కన అంటూ వాదించుకుంటుంటే, మా అత్తగారు అమ్మాయి ఎంతో కలివిడిగా కలిసిపొయింది రా అని ఈయనతో అంటుంటే విని ఈసారి మనమందరం కలసి వెళదామండి అత్తయ్యగారూ! అన్న మాటలకి పొలమారిందో లేక ఇడ్లీలో అద్దుకున్న కందిపొడి గొంతులో అడ్డుపడిందో!!!!!!

Friday, June 12, 2009

మంచి దొంగ

అవి నేను ఉద్యోగంలో కొత్తగా చేరిన రోజులు, వరంగల్ లో ఒక పోర్షన్ అద్దెకు తీసుకుని ముగ్గురు స్నేహితులము కలసి ఉండేవాళ్ళము.
నా స్నేహితులిద్దరూ వాళ్ళ ఇళ్ళకు వెళితే నేను ఒక్కదాన్ని బోర్ కొడుతుందని తలుపు తాళం వేసి గొళ్ళెం మరచి పక్కింట్లో టి.వి చూస్తూ కూర్చున్నాను. 'స్వర్ణకమలం' విశ్వనాధ్ గారి సినిమా నేను ఎన్నిసార్లు చూసినా చూడాలనిపిస్తుంది, అర్థం చేసుకోరూ!!!!
మీరు అర్థం చేసుకున్నరో లేదో కాని నాకు వంటచేసి పెట్టినవాడు మాత్రం బాగా అర్థం చేసుకున్నాడేమో.......
మా పోర్షన్ గొళ్ళెం తీసి వంట చేసుకుని వాడు చక్కగా కొత్త ఆవకాయతో అన్నం ఆరగించి నాకు కూడా కాస్త ఉంచిచాడనుకోండి!!! నా హ్యాండ్ బ్యాగ్ లోని డబ్బులు జీతం మొత్తం తీసుకుని, 3 రూపాయిలు నాకు మరునాడు బస్సు కోసం అని చిల్లర ఉంచి...అక్కడ టేబుల్ పైన ఉన్న పుస్తకాల్లో నుండి యండమూరిగారి అభిమాని అనుకుంటాను పాపం.......'ప్రార్ధనా, 'డైరీ ఆఫ్ మిస్సెస్స్ శారద ' అనే రెండు నవల్లను తీసుకుని మిగిలిన పుస్తకాలు చక్కగా సర్దిపెట్టాడు. వెళుతూ వెళుతూ ఏమనుకున్నాడో గిన్నెలు కడిగి బోర్లించిన గిన్నె క్రింద చిన్ని కాగితంపైన,
సమయ భారం వలన కూర చేయలేదు పచ్చడితో సరిపెట్టుకోండి అని వ్రాసి మరీ వెళ్ళాడు. ఎంతైనా మంచిదొంగ కదండీ!!!
ఈవిడ ఏంటి వాడు అంటుంది, అది అయ్యివుండవచ్చు కదా అనుకుంటున్నారా? మంచి దొంగ సిగరెట్ ప్యాకెట్ వంట గదిలో మరచి పోయి వెళ్ళాడు. అది అయ్యివుంటే మా ముగ్గురి చీరలకి రెక్కలు వచ్చి వుండేవి......ఏవంటారు!!!
ఏమైతేనేమీ మంచి దొంగే అంటారు!!!

Friday, May 15, 2009

మా సరిగంగ స్నానాలు.

మా పెళ్ళైన మొదటి సంవత్సరం మా అత్తగారు మాతో శివరాత్రికి గోదావరి నదిలో సరిగంగ స్నానాలు చేయించాలని తెగ సంబరపడి మమ్మల్ని రాజమండ్రి రమ్మని పిలిచారు. ఇద్దరం కలసి బయలుదేరే వీలులేక నేను వరంగల్ లో రైలు ఎక్కి ఆయనని విజయవాడలో కలిసి ఇద్దరం రాజమండ్రి వెళ్ళాలని అనుకున్నాము. ఇంతవరకు బాగానే వుంది.......నేను వరంగల్ లో రైలెక్కి బెర్త్ చూసుకుని ఎక్కి పడుకున్నాను, నిద్రపట్టేసింది ఎప్పుడు విజయవాడ వచ్చిందో తెలియలేదు. ఆయన అచివర నుండి ఈచివరి వరకు రైలంతా వెతికి చివరికి ఎక్కి కూర్చున్నారు.
నాకు బండి కొద్దిక్షణాలలో బయలుదేరుతుంది అనగా మెలుకువ వచ్చి, మావారి కోసం వెతికి ఆయన బహుశా ఈ బండి ఎక్కివుండరు అనుకుని క్రిందికి దిగి ప్లాట్ ఫారం మీద నేను ఆయనకోసం వెతుకుతుంటే..... ట్రైన్ బయలుదేరి చివరి బోగీ ప్లాట్ ఫారం వీడే సమయానికి ఆయన బోగీలో నన్ను వెతుకుతూ కనిపించారు, ఆయన నన్ను చూడలేదు నేను ఎక్కలేను.......ఎందుకని అనుకుంటున్నారా!!!..... రైలుబండి అప్పుడే మేల్కోని ఊపందుకుంది మరి. సమయం అర్థరాత్రి ఒంటిగంట కొట్టింది. ఏమి చేయాలో అని ఆలోచిస్తూ స్టేషన్ మాస్టర్ ని వేరే ట్రైన్ వుందేమో అని అడగడానికి వెళ్ళిన నాకు, తెల్లారేవరకు ట్రైన్ లేదని మీవారికి ఏలూరు స్టేషన్ లో మీరు ఇక్కడ వున్నట్టు మెసేజ్ అందించగలమని సలహా ఇచ్చారు. చేసేది లేక ఇలాగైనా ఆయనకి కాస్త టెన్షన్ తగ్గిద్దామని అనౌన్స్ చేయమ
న్నాను....అలా స్టేషన్ మాస్టర్ గారు సహాయం చేసి పుణ్యం కట్టుకున్నారు.
అనౌన్స్మెంట్ విన్న ఆయన ఏలూరు నుండి బయలుదేరి విజయవాడ వచ్చేసరికి ఉదయం నాలుగు గంటలు. మేము కలసి మళ్ళీ రైలెక్కి రాజమండ్రి ఇంటికి చేరుకునేసరికి...... అందరూ స్నానాలు చేసి ఇంటికి వచ్చి ఈసారి వీళ్ళు ఏ సాహాసకార్యం వెలగబెట్టారో అని ఎదురు చూస్తున్నారు......వాళ్ళ ఎదురుచూపులని నేను వమ్ము కానిస్తానా చెప్పండి!!!

Tuesday, May 12, 2009

థ్రిల్...

నేను వరంగల్ బ్యాంక్, మావారు విజయవాడలో ఉద్యోగం చేస్తున్న రోజులు.... వీలు చూసుకుని ఆయన వచ్చేవారు. ఎప్పుడూ ఆయనే ఎందుకు, ఈసారి నేను వెళ్ళి ఆశ్చర్యపరుద్దాం అనుకుని ఆఫీసులో పరిమిషన్ తీసుకుని బయలుదేరి విజయవాడ చేరుకునేసరికి రాత్రి ఎనిమిది గంటలైయింది. ఆయన రూంలో కనిపించక పోయేసరికి నాకు సగం నీరసం వచ్చింది, మావారు ఆరోజు సాయంత్రమే వరంగల్ బస్సెక్కారని తెలిసిన నాకు.....పూర్తిగా..... ఏమని చెప్పను!!! ఈసురోమంటూ బస్ట్సాండ్ కి వచ్చి బస్సెక్కి చతికిలపడి వరంగల్ చేరుకునే సరికి ఉదయం 5గంటలు. నా రూమ్మేట్ ఎక్కడికి వెళ్ళావు మీవారూ నేను ఎంత కంగారు పడ్డామో తెలుసా అంటూ నాలుగు చివాట్లు పెట్టింది. దానికి నేను విజయవాడ వెళ్ళి ఆయనను థ్రిల్ పరుద్దామనుకున్న విషయము చెబితే జాలిగా నావైపుచూసి... ఎవరిని థ్రిల్ చేసావు అని అడిగింది.
ఇంక ఆయన సంగతి వేరేచెప్పలా చెప్పండి!! నీకు ఎందుకొచ్చిన ఈ థ్రిల్ పాట్లు చెప్పు అంటూ మెత్తగా మందలించారు.
అది మొదలు మేమిద్దరము ఒకే ఊరుకి బదిలీ అయి కలసివున్న ఎక్కడికి వెళ్ళిన ఒకరికొకరం చెప్పుకోకుండా వెళ్ళం...

Sunday, April 26, 2009

హాయ్!!

బ్లాగ్ మిత్రులందరికీ వందనాలు....

ఈ ఆదివారం సమయం దొరికింది నా బ్లాగ్ తయారుచేసుకోవడానికి, గత ఐదు వారాల నుండి అనుకుంటున్నా నేను మీ అందరితో నా స్మృతులను పంచుకోవాలని మీలో ఒకరిని కావాలని....నా అనుభవాల్ని, అనుభూతుల్ని పంచుకునే అవకాశాన్ని ఇస్తారని ఆశిస్తున్నా...

ఏవండోయ్!!అలా అన్నానే కాని ఏం వ్రాస్తానో.... ఏం పంచుకుంటానో అని ఒకటే టెన్షన్ తో వంట ఏదో అయింది అనిపించి, దానికి ప్రేమ అనే మసాలని దట్టించి మావారికి పెట్టాను, తినడమైతే తిన్నారు మారు మాట్లాడకుండా కాని నిద్రకి ఉపక్రమిస్తూ...నీ పాకశాస్త్రా ప్రావీణ్యానికి బ్లాగ్ వాళ్ళని బలిచేయకని ఒక సలహా ఇచ్చారు.
తప్పుతుందా..!అంటే ఇంక వంటల గురించి వ్రాయలేను(బ్రతికి పోయాము అనుకుంటున్నారని నాకు తెలుసులెండి)అయినా ఇంక వేరే మార్గాలే లేవంటారా?

అవును! ఈరోజు మంచిరోజో కాదో చూసుకుని వ్రాయడం మొదలుపెట్టు లేకపోతే మీ బ్లాగ్ మిత్రులు వ్యాఖ్యల బాంబులు వేస్తారు జాగ్రత్త అని మరో సలహా... అయినా పిచ్చి కాని ఇంతమంది మిత్రులు దొరికిన రోజు ఎంతో శుభప్రదమైనదని వేరే చెప్పాల?