Tuesday, September 14, 2010

"మసాలా టీ"

"టీ" త్రాగుతున్న శ్రీవారు కబుర్ల మధ్యలో నా బ్లాగ్ పై అభిమానం పెల్లుబికి ఏంటి ఈ మధ్య ఏమీ రాయడంలేదు అన్నదానికి సమాధానంగా.... ఏమీలేదు ఏదో బ్రహ్మచారులు భార్యభాధితులు అవుతున్న తరుణంలో మన స్మృతులతో వాళ్ళని ఇంకొంచెం కంగారు పెట్టడం ఎందుకని చెప్పేలోపే.... తమరి ఆలోచనలు ఆవకాయతో అటకెక్కాయా అన్నారు....ఇంక నేను ఊరకుంటానా చెప్పండి?? ఆయనగారు తనంతట తనే వారి ప్రతాపాల గురించి చెప్పమన్నాక, అదేలెండి వ్రాయమన్నాక)చదివేసుకోండి:):):)

వరంగల్ లో కలసి పనిచేసిన అభిమానమో లేక హైదరాబాదులో వాళ్ళకి ఉన్న పనుల ప్రభావమో ఒక ఆదివారము నా ఐదుగురి కొలీగ్స్ ని మాఇంటికి వచ్చేలా చేసింది.వాళ్ళతో మాట్లాడుతున్న నాపై మావారికి ప్రేమ పొంగిందో లేక వచ్చివారి దగ్గర మాంచి పేరు కొట్టేయాలి అన్న ఆలోచనే వచ్చిందో.....పాలు వేడిచేయమంటే పెరుగు పొయ్యిమీదపెట్టే ప్రబుద్దులు "మసాలా టీ" చేసి వాటితో పాటు బిస్కెట్స్ ని కూడా సర్వ్ చేసారు.ఆయన ట్రే తీసుకుని హాల్లోకి వస్తుంటే ప్రెజంటేషన్ ఈస్ మోర్ ఇంపోర్టెంట్ దాన్ ప్రిపరేషన్ (presentation is more important than preparation) అని అప్పుడెప్పుడో సంజీవ్ కపూర్ ప్రఖ్యాత చెఫ్ చెప్పిన మాటలు నా మెదడులో, ఆయనగారి పాకశాస్త్ర ప్రావీణ్యము తెలిసిన నా ప్రేగులు కడుపులో సుడులు తిరిగాయి. నేను సరిపెట్టుకుని వాళ్ళకి సర్దిచెప్పేలోపే ఈయనగారు వాళ్ళతో మాట్లాడడం అందరికి ఒక్కోప్లేటు అందించడం జరిగిపోయింది. బిస్కెట్స్ తింటూ మావారితో మాట్లాడుతూ నా అదృష్టానికి మనసులో కుళ్ళుకుంటూ ఒకరు, ఇంటికి వెళ్ళి ఇది చెప్పి వాళ్ళాయనకి ఇంకా మంచిపేరు ఎలా తెప్పించాలో అని ఇంకొకరు, నా అదృష్టాన్ని పొగుడుతూ మరొకరు, టీ వైపు చూస్తూ మరో ఇద్దరు తినడం కానిచ్చారు.

బిస్కెట్స్ తిన్నాక టీ అలవాటులేదని ఒకరు వద్దంటే, టీ వాసనతో దాని రుచిని పసికట్టిన ఆవిడ సుతారంగా కాదంది. మరొకావిడ మాటల్లో పడి టీ మాటే మరచింది. వీరి ముగ్గురి అదృష్టానికి కుళ్ళుకోవడం నావంతైతే మావారి "మసాలా టీ" ని నషాలానికి ఎక్కించుకున్నవారు ఇరువురు. దాని ప్రభావంతో ఒకరు ఇప్పటికీ టీ ని ముట్టరు. మరొకరు మావారిని తలచుకున్నప్పుడు మసాలాని మరువరు.
హైదరాబాద్ ఇరానీ టీ ఎలా చేయాలో తెలియదు, మసాల టీ తెలుసుకుని చేయవలసినంత గొప్పదేం కాదు అనుకున్న మావారు టీ పొడిని, పాలని, పంచదారని కలిపి మరిగించి అందులో మసాలాపొడిని స్పెషల్ టేస్ట్ కోసం అల్లంవెల్లుల్లి పేస్ట్ ని కొంచెం వేసారండి అది విషయం........

Saturday, May 8, 2010

"ఆహా ఆవకాయ"

అమ్మ అయినా అత్త అయినా ఈసారి ఆవకాయ నేనే పట్టి పంచి అందరి దగ్గరా మంచి మార్కులు కొట్టెయ్యాలి అన్న ఆలోచన వచ్చిందే తడువు "ఊరగాయలు-పచ్చళ్ళు" మీద రాసిన గ్రంధాలని అన్నీ తిరగవేసి ఆఖరికి "కాంతామణి వంటలు" అనే పుస్తకంలోని చేయువిధానము ఆవిడ వ్రాసిన ఉపోద్ఘాతము నాకు యమగా నచ్చి అలాచేయాలి అని ఫిక్స్ అయిపోయాను.

ఈయనగారికి చెపితే నీకు ఎందుకు ఆ శ్రమ హాయిగా అమ్మో, అత్తయ్యో పట్టిన పచ్చడిని ఆరగించి ఆనందించక అని నాకు ఒక ఫ్రీ సలహాని పడేసారు. అలాచెప్పిన వెంటనే వింటే ఇలా నా స్మృతి పధంలో "ఆహా ఆవకాయ" చేరేదా చెప్పండి!

ఊరగాయలకి, ఊరమిరపకాయలకి సెలవు ఇవ్వరు అని తెలిసి మా బాస్ మెచ్చి సెలవు ఇచ్చే విధంగా నాలుగు అబద్దాలాడి సెలవు తీసుకుని అటునుండి అటే బజారుకి వెళ్ళి కారంపొడితో పాటు కావలసిన సరుకులన్నీ తీసుకుని ఇంటికి వచ్చి కాంతామణిగారి వంటల పుస్తకాన్ని మరొక్కసారి చదివి ఒక్కపదం కూడా వదిలివేయకుండా ఆవిడ చెప్పినట్లు అన్నీ సమపాళ్ళలో వేసి పప్పునూనె వేసి చేతితో కలిపి జాడీలోకి ఎత్తుదాం అనుకుని అమ్మ ఎప్పుడో అన్న మాటలు గుర్తుకు వచ్చి వద్దులే అని గరిటతో కలిపి జాడీలోకి ఎత్తి మూడవరోజు(అపార్ధం చేసుకోకండి) కోసం ఎదురుచూసా పచ్చడిని కలిపి అందరికి పంచాలని. ఆరోజు రానే వచ్చింది ఉదయాన్నే తలంటుకుని భగవంతునికి నమస్కరించి ఊరగాయ జాడీని తీసి గరిటతో కలిపితే చక్కని ఎరుపురంగుతో పైన పప్పునూనె తేలుతూ చూడముచ్చటగా వుంది. ఊరగాయజాడీని లాంగ్ షాట్ లో క్లోజప్ లో చూసుకుని మరీ మురిసిపోయాను. ఎందుకు అంత మురిసిపోవడం అంటారా.... మా అమ్మమ్మ చెప్పేది ఊరగాయని కలిపేటప్పుడు తేలిన రంగునిబట్టి దాని రుచి చెప్పవచ్చని, అలా చూస్తే ఇంక నా ఆవకాయ రుచికి తిరుగులేదని తేలిపోయింది కదండి! అదన్నమాట.
ఆదివారం ఆరు హార్లిక్స్ సీసాలను తీసుకుని కడిగి తుడిచి ఆవకాయని అందులోకి తీసి....అమ్మకి, అత్తయ్యకి, పిన్నికి, చెల్లికి, మా ఇద్దరు మరుదులకి ఇచ్చి వారి నుండి కమెంట్స్ కోసం కాటికాడ నక్కలా(ఉపమానం బాగాలేదు కాని ప్రాస కుదిరిందని) ఎదురుచూసాను.

సాయంత్రం ఆరుగంటలకి అమ్మ ఫోన్...అమ్మాయ్ నీకు పుట్టింటి మీద మమకారం కాస్త ఎక్కువేమోనే ఆవకాయ రంగు అదిరింది కానీ అస్సలు కారమేలేదు అంటూ....
ఏడు గంటలకి అత్తయ్యగారు....ఆవకాయలో కారం వేయడానికి బదులు హోలీ రంగు ఏమైనా కలిపావా అంటూ....
పిన్ని...పిచ్చిదానా ఎక్కడో ఏదో పొరపాటు చూసుకోమంటూ....
చెల్లి...నీకు ఈ ప్రయోగాలు ఎందుకే అంటూ....
మరుదులు...మేమింకా రుచి చూడలేదంటూ....

ఆలోచిస్తే***ఆవకాయలో అన్నీ కరెక్టుగానే వేసాను బజారులో కొన్న కల్తీకారంతో పాటు....అది కారం కాదు రంపంపొడిలో రంగు కలిపారని అందుకే దానికి రంగు తప్ప రుచిలేదని. ఆ షాపువాడి దగ్గర డబ్బులు వసూలు చేసాననుకోండి అది వేరేసంగతి. అలా ముగిసింది నా ఆవకాయ పట్టాలన్న ఆలోచన. అప్పటి నుండి ఇప్పటి వరకు మరలా ప్రయత్నించలేదు ఏ ప్రయోగం పచ్చళ్ళపై చేయలేదు.అడుకున్నే వాడికి అరవై కూరల్లాగా....అమ్మ, అత్తయ్య అభిమానంతో ఇచ్చే ఆవకాయతో అటు ఆరు, ఇటు ఆరు నెలలు గడిచి పోతున్నాయండి.

Wednesday, March 10, 2010

అలవాట్లో పొరపాటు

వరంగల్ లో మూడుగదుల పోర్షన్ ని అద్దెకు తీసుకున్న కొత్తలో ఏదో నాలుగురోజులు నా చేతివంట తిని నాకు చేదోడు వాదోడుగా ఉండి ఉద్దరిద్దాము అనుకున్న మావారి అలనాటి ఉద్దంతమండి ఇది.....

ఆ రోజు ఉదయాన్నే లేచి హడావిడిగా తయారై వంటచేసుకుని బాక్స్ లో సర్దుకుని ఇంటి ఓనరు వాళ్ళు మేడారం జాతరకు వెళ్ళారు కదా అన్న అతి జాగ్రత్తలో ఇంటికి ముందు వెనుక కూడా తాళం వేసుకుని వాటిని జాగ్రత్తగా హ్యాండ్ బ్యాగ్ లో వేసుకుని ఈయనగారు ముసుగుతన్ని ఇంట్లో పడుకున్న విషయాన్ని అలవాటులో పొరపాటుగా మరచి ఆఫీసుకి వుడాయించాను. అలవాటులో పొరపాటు అంటే అపార్థం చేసుకోకండి....
అదే ఈయనగారిని శని, ఆదివారం సెలవురోజుల్లో మాత్రమే చూసే అదృష్టమున్న నా కనులకి మెదడు గురు, శుక్రవారాలు ఈయనగారు వున్న విషయాన్ని చేరవేయడం మరచింది అన్నమాట!

పదింటికి నిద్రలేచిన శ్రీవారు కాఫీ....కాఫీ అని అరచిన అరుపులకి వంటింట్లో బోర్లించిన ఖాళీగ్లాసులు వెక్కిరించాయి.
ఆ వెక్కిరింపులతో వాస్తవంలోకి వచ్చిన ఈయనగారు కాలకృత్యాలైనా తీర్చుకుందామని వెనుకవైపుకు వెళ్ళి బోల్ట్ తీయ ప్రయత్నిస్తే ఏముంది నా అతిజాగ్రత్త ఆయనని జాగృతి చేసింది. పక్కింటివాళ్ళని పిలుద్దామంటే వాళ్ళు జాతరకి వెళ్ళారు. నాకు కబురు చేద్దామంటే అప్పట్లో సెల్ ఫోన్లు లేవు, అద్దె ఇంట్లో లాండ్ లైన్ పెట్టించుకునే స్టేజ్ మాది కాదు. ఇరుగు పొరుగు వారిని పిలవడానికి ఈయనగారికి కొత్త....ఏంచేయాలో తెలియక అటుఇటు తలుపుని నాలుగు సార్లు బాది, ఆ పోర్షన్ కి ఉన్న రెండు కిటీకీల్లోంచి ఆరుసార్లు ఎవరైనా కనిపిస్తారేమో అని చూసి, అరచినా ఆలకించేవారు లేరని తెలిసి మంచంపై పొర్లుతూ రెండు గంటలు గడిపిన ఈయనని చూసిన కాలకృత్యాలకి ఈర్ష్య కలిగిందో ఏమో మేమున్నామంటూ ఒకటే గొడవ....దీనికి తోడు పొగత్రాగుట నేరము అనే ప్రక్రియలో భాగంగా ఖాళీ సిగరెట్టు ప్యాకెట్టు ఈయనగారిని చూసి నా వంతుగా నవ్వింది.

ఇంక ఇక్కడ నేను ఆఫీస్ లో డబ్బుల అవకతవకల లెక్కలతో లంచ్ మూడు గంటలకి చేస్తూ కూడా ఎక్కడ లెక్కల్లో పొరపాటు జరిగిందో కదా అని ఆలోచిస్తూ.....నాలుగున్నరకి టీ త్రాగుతూ మావారికి ప్రీతిపాత్రమైన వాటిలో టీ కూడా ఒకటి కాబట్టి అది నాకు మావారు ఇంటివద్ద ఉన్నవిషయాన్ని గుర్తుచేసి ఋణం తీర్చుకుంది!
వెంటనే చేసిన పొరపాటు తెలుసుకుని ఆటోలో ఇంటికి వెళ్ళి తాళం తీసిన ఈయనగారి తిట్లకి రెడీగా వినడానికి వేచివున్న నా చెవులకి ఒక్క మాటకూడా వినిపించలేదు, నేను క్షమించమని అడిగేలోపే ఈయనగారు ఒక్క ఉదుటన నా చేతిలోని తాళాలగుత్తిని లాక్కుని వెనుక వైపుకి పరిగెత్తారు.తరువాత విషయం ఏం జరిగి ఉంటుందో మీ అందరికీ నేను రాయకపోయినా అర్థమై ఉంటుందని నాకు తెలుసులెండి.

Thursday, January 21, 2010

మై డార్లింగ్ డ్రాకులా!

ఓసారి నాలుగురోజులు సెలవు తీసుకుని మావారి ఊరెళ్ళానండి....అదేంటని ఆశ్చర్యపోరని నాకు తెలుసులెండి, ఎందుకంటే నేనిక్కడ(వరంగల్) ఆయనక్కడ(విజయవాడ) అని మీకు తెలుసుననే విషయం నాకు తెలుసుగా....
ఇంక అసలు విషయానికి వస్తే....ఆరోజు శనివారం రాత్రి మేమిద్దరం సెకండ్ షో సినిమాకి వెళ్ళాం, మర్నాడు కాస్త ఆలస్యంగా లేచినా పర్వాలేదు అనుకుని హోటల్ లో టిఫిన్ చేసి థియేటర్ వద్దకు చేరుకునే సరికి ఏ తెలుగు సినిమాకి టిక్కెట్లు దొరకలేదు... ఎలా దొరుకుతాయి చెప్పండి అప్పటికి సమయం పది కావొస్తుంది. అయ్యో! నీకు సినిమా చూపించ లేకపోయానే అని బాధపడుతూ వాళ్ళ రూమేట్స్ తో చూసిన సినిమాల గురించి వివరిస్తుంటే తెలిసిందేవిటంటే ప్రక్కన థియేటర్లో "డ్రాకులా" సినిమా ఆడుతుందని అది ఆయనకి చూడాలనివుందని.
సరేలే సినిమాకి భాషావిభేధాలేల అనుకుని ఆ సినిమా హాల్లోకి చేరుకునే సరికి మాలాంటి భాధితులతో హాలు అక్కడక్కడా నిండివుంది. అప్పట్లో నాలాంటి ఆంగ్లభాష అర్థంకాని వారికోసం చిత్రం చూపించడానికి ముందు తెలుగులో చిత్రకధని క్లుప్తంగా చెప్పేవారు. ఆలస్యంగా అడుగిడడం వలన గుండెధైర్యం లేనివారు జాగ్రత్త అన్న ఆఖరి పలుకులు తప్ప మిగిలిన కధని వినలేకపోయాను. ఆ ఏముందిలే మనకున్న సినీ పరిజ్ఞానంతో ఆపాటి కధని అర్థం చేసుకోలేమా అనుకుని శ్రద్ధగా ప్రతి డ్రాకులా డైలాగులు వినసాగాను.తెరపై డ్రాకులా హీరోయిన్ని కొరకడం ఆవిడకి రెండు కోరలు రావడం దాన్ని క్లోజప్ లో చూపిస్తూ ఇంటర్వెల్ వేసిందే తడువు అందరూ లేచి బయటికి వెళ్ళడం ఒకదాని వెంట ఒకటి జరిగిపోయాయి.ఈయనగారు నాకు కూల్ డ్రింక్ తీసురావడానికి బయటికి వెళ్ళి(అది కాదు అనేవిషయం మీకు తెలిసినా అలా అనుకోవడం నా తృప్తి)ఎప్పుడు తిరిగి వచ్చి నా ప్రక్కన కుర్చున్నారో తెలియదు కాని ఆంగ్లభాషే సరిగ్గా అర్థం కాని నేను ఆంగ్లడ్రాకులాలని అర్థం చేసుకోవడంలో లీనమైపోయాను.అప్పుడప్పుడూ ఉలిక్కిపడి చెవులు మూసుకుని అరిచాను అనేవిషయం నాకు తరువాత తెలిసిందిలెండి.
మొత్తానికి చిత్రం చివరిలో రాత్రి అయితే అందరూ డ్రాకులాలుగా మారిపోతారు అనిమాత్రం నా తెలివైన బుర్రకి అర్థమైంది తెరపై చిత్రం అర్థరాత్రి అంతమైంది.పదండి అని ప్రక్కన వున్న ఈయనగారి చేయి పట్టుకుని(ధైర్యం కోసం) లేచిన నాకు ఎదురుగా సారీ రా.. పద వెళదాం అంటూ మావారి ప్రతిరూపం ఆయన వెనుక చేతికికట్టుతో ఎవరిదో తెలిసిన ముఖం. డ్రాకులాలపై పూర్తిగా ప్రేమలో మునిగిన నన్ను వాళ్ళ సామ్రాజ్యంలో కలుపుకోవడానికి ఈయన రూపంలో వచ్చారేమోనని చెప్పడానికి అటుతిరిన నేను అప్రయత్నంగా మీరా అని నోరువెళ్ళపెట్టి చేతులు విధిలించి కుర్చీలో చతికిల పడ్డాను.
విషయం ఏమిటంటే ఇంటర్వెల్ లో బయటికి వెళ్ళి నాలుగు దమ్ములు కొట్టి టాయిలెట్లోకి వెళ్ళిన ఈయనకి అక్కడ వాళ్ళ ఫ్రెండ్ చేయి టాయిలెట్ తలుపు మద్యలో పడి దెబ్బతగిలిందని తెలిసి అతన్ని తీసుకుని దగ్గర్లోని హాస్పిటల్లో కట్టు కట్టించి తీసుకుని వచ్చారు. హాస్పిటల్ కి తీసుకుని వెళుతూ థియేటర్లో మా మావయ్య కనిపిస్తే నేను లోపల ఉన్నానని కంగారు పడతానని నాకు ఈవిషయం చెప్పొదని గంటలో వస్తానని చెప్పి వెళ్ళారు. నేను సినిమా చూస్తూ నా ప్రక్కన కూర్చుని నన్ను పలకరించి కూల్ ఢ్రింక్ అందించిన మావయ్యని గమనించలేదు. మావయ్య కూడా సరేలే సినిమా అయ్యాక మాట్లాడవచ్చని సినిమా చుస్తూ మధ్య మధ్యలో నా విన్యాసాలని కూడా తిలకించారన్నమాట.మొన్న పండకి మావయ్య వాళ్ళు ఇంటికి వచ్చినప్పుడు ఈ విషయం గురించి చెప్పుకుని నవ్వుకున్నది మీతో ఇలా పంచుకుంటున్నానండి.

Wednesday, January 13, 2010

బాత్ రూం లో భోగి...

అవి సంక్రాంతి సంబరాల రోజులు....నేను చెల్లెలు కలసి ముగ్గులు వేస్తూ వాటికి రంగులు నింపి అలా కాలనీలో ముగ్గులు చూస్తూ స్నేహితులతో కబుర్లలో నిమగ్నమై ఉండగా అల్లుడుగారు అత్తగారింటికి అడుగిడినారు....ఎవరా అని ఆశ్చర్యపోతున్నారా! అదేనండి మావారే, మొదటి సంవత్సరం క్యాంటీన్ కాఫీతో కడుపు ఖలాస్ అయింది కదా ఈసారైనా అల్లుడిగారికి ఆతిథ్యంతో అదరగొట్టేయాలనుకున్న అత్తగారి ఆహ్వానాన్ని ఆనందంగా అంగీకరించి భోగి నాడు అరుదెంచిన మా శ్రీవారి అహ్లాదకరమైన అనుభవమన్నమాట.....

అడుగిడిన అల్లుడిగారు అత్తగారి పలకరింపుల అనంతరం స్నానానికి వెళుతూ, నేను కనపడలేదన్న కలవరమో, ముంగిట నేను వేసిన ముగ్గులని చూసిన పరవశమో లేక ఎవరిని అడగాలి అన్న మొహమాటమో కాని అక్కడ తాడుపై వేసిఉన్న టవల్ ని కట్టుకుని బాత్రూంలోకి దూరిన గంటకి కూడా బయటికి రాలేదు.......ఇక్కడ బయట అమ్మ ఇంతసేపు అల్లుడుగారు లోపల ఏం చేస్తున్నారో అనుకుంటూ ఇంకా ఇంటికి రాకుండా ఏం పెత్తనాలు వెలగబెడుతున్నారో వీళ్ళు అని మనసులో మమ్మల్ని తిట్టుకుంటున్న అరగంటకి అరుదెంచిన మాకు అమ్మ చెప్పిన విషయానికి ఆత్రుతగా పెరట్లోకి వెళ్ళి తలుపు కొట్టిన నాకు టవల్ కాస్త నా మొహాన్న పడేయమన్న ఈయనగారి విసుగుతో కూడిన స్వరం విని టవల్ అందించాక నాకు అసలు విషయం కొంచం అర్థమైంది మిగిలినది మావారు వినిపించారు.

అత్తారింటికి వస్తున్న ఆనందంలో కాదులెండి నన్ను చూడాలన్న ఆత్రుతలో అదీ కాదు మరదళ్ళతో ముచ్చటించాలన్న మురిపంలో తాళాలని, పర్స్ ని ఓ జేబుదొంగకి సమర్పించి తాళం వేసిన సూట్ కేస్ తో వచ్చారు. ఇక్కడ నేను కనపడపోయేసరికి మొహమాటానికి పోయి పెరట్లో తాడుపై వున్న టవల్ ని తీసుకుని బాత్రూంలోకి దూరి టవల్ విప్పి తలుపుపైన వేసారు లోపల ఈయన ఉన్నవిషయం తెలియని పనిమనిషి అది ఉతకవలసిన టవల్ అని తీసుకుని వెళ్ళి నానపెట్టేసింది. స్నానం చేసి బయటికి రావాలంటే టవల్ లేదు, అప్పటికీ రెండుసార్లు ఈయనగారు అరచినది అత్తగారికి పని హడావిడిలో వినపడలేదు, అమ్మ అల్లుడిగారిని అడిగితే బాగుండదని అడగలేదు.....దాని పర్యవసానం మావారు బాత్ రూం లో గంటన్నర ఒంటికాలిపైన జపం అన్నమాట....

తరువాత........ ఏముంటుందండి సూట్ కేస్ తాళాలని బ్రద్దలకొట్టి డ్రెస్ వేసుకునే వరకు టవల్ కట్టుకుని టాలీవుడ్ సల్మాన్ ఖాన్ లెవల్ లో మరదళ్ళకి ఫోజ్ ఇచ్చారన్నమాట....