Saturday, September 5, 2009

క్యాంటీన్ కాఫీ...కడుపు కలాస్!

పెళ్ళైన తరువాత మొదటిసారి అత్తగారింటికి నేను వెళితే అది రొటీన్ కానీ మావారు వెళితే వెరైటీ అనను కానీ వింత అని మాత్రం అంటాను...... ఎందుకనంటారా?
డిసెంబరు నెలలో పెళ్ళిచేసుకుని మంచి రొమాంటిక్ మూడ్ లో నన్ను తీసుకుని నెలలో అత్తగారింటికి బయలుదేరిన మావారి అవస్తలు అలాంటివండి. బయలుదేరితి పొమ్ము....రిజర్వేషను కంఫాం కాకుండా కంపార్ట్మెంటులో నాతోకలసి కాలు పెట్టనేల! పెట్టితిరిపొమ్ము టీ.సీ కి నాలుగు పాతికలు కొట్టనేల, కొట్టిరికదా అని టీ.సీ చెరొక కంపార్ట్మెంట్లో బెర్త్ లు ఇవ్వనేల, ఇచ్చిరి కదా అని ఆదమరచి నిదురించక అక్కడ ఆయన ఇక్కడ నేను ఆలోచిస్తూ జాగారము చేయనేల?
హమ్మయ్య! ఇక్కడితో ఆగిపోయిందనుకుంటున్నారా? అంత ఈజీగా మిమ్మల్ని వదివేస్తానా చెప్పండి..... తెల్లవారుజామున ఆరుగంటలకి చేరవలసిన రైలు ఎక్కడో గూడ్స్ పట్టాలు తప్పితే ఇక్కడ మా ఎడబాటుని చూడలేక మా రైలు పదిగంటలు ఆలశ్యాన్ని ప్రకటించి మమ్మల్ని ప్రొద్దున్నుండి సాయంత్రంవరకు మాట్లాడుకోమని వదిలేసింది. పొద్దున్నే కాఫీ కడుపులో పడనిదే కబుర్లాడని మావారిపై కేసముద్రంలోని రైల్వే క్యాంటీన్ వాడు కనికరించి కషాయానికి కాస్త ఎక్కువ రుచిగల కాఫీని అందించాడు. అదే మహాభాగ్యమనుకుని తాగిన వారందరితో పాలు అయిపోయినవి అంటూ మరోసారి కాఫీ అడిగినవారికి చిక్కని కాఫీలాంటి చక్కని సమాధానమిచ్చి చల్లగా జారుకున్నాడు.
ఇక్కడ మావారికి కాఫీ కడుపులోకి వెళ్ళి ఖాళీగా ఉండి ఏమిచేయాలో తోచక పేగులతో అనుబందాన్ని పెనవేసుకుని కడుపుని నులిపెట్టి మెలిపెట్టి పదినిముషాలకి ఒకసారి మావారిని టాయిలెట్ కి వెళ్ళేలా చేసింది. ఇంచుమించు కాఫీ తాగినవారిలో చాలా మంది పరిస్థితి అంతే, కాస్త మావారి పై ప్రేమ అధికమై వాంతులకి కూడా దారి తీసింది. పరిస్థితి విషమించక ముందే అక్కడి లోకల్ డాక్టర్ గారి రెండు సెలైన్ సీసాలు, మూడుమాత్రలు, నాలుగు గంటల అవస్థతో కడుపు మొత్తం ఖాళీ అయి కాస్త సర్దుకుంది. నాలుగు గంటలు మావారి విశ్రాంతి, మరో రెండుగంటలు "క్యాంటీన్ మరియు రైల్వే సిబ్బంది" అనే విషయం మీద ఇష్టాగోష్టితో పదిగంటలు గడిచిందంటూ రైలు పరుగు తీసి సాయంత్రానికి గమ్యాన్ని చేర్చింది.
అక్కడ అల్లుడు అడుగిడుతున్నాడని అలకపానుపు ఎక్కనీయరాదని అత్తగారు అరిసెలు, సున్నిఉండలు లాంటి పిండివంటలతో ఆనందింప చేయాలని ఆయాసపడి అమర్చినవన్నీ ఉన్న నాలుగు రోజులు ఒట్టి మజ్జిగన్నం తిని సేదతీరిన ఈయనగారిని చూసి చప్పబడ్డాయి....అల్లుడిగారిని కాస్త అవి ఇవి తిని గట్టిపడమని చెప్పవే అంటూ అమ్మ సలహాలు, అక్కా...బావ మరీ ఇంత సుకుమారుడా! అంటూ చెల్లెళ్ళ చలోక్తులు, మావారి అవస్థలు........మరుసటి నెలలో మొదటి పండుగకి వచ్చినప్పుడు తీరినవి అందరి అచ్చటా ముచ్చట్లు!!!