Saturday, September 5, 2009

క్యాంటీన్ కాఫీ...కడుపు కలాస్!

పెళ్ళైన తరువాత మొదటిసారి అత్తగారింటికి నేను వెళితే అది రొటీన్ కానీ మావారు వెళితే వెరైటీ అనను కానీ వింత అని మాత్రం అంటాను...... ఎందుకనంటారా?
డిసెంబరు నెలలో పెళ్ళిచేసుకుని మంచి రొమాంటిక్ మూడ్ లో నన్ను తీసుకుని నెలలో అత్తగారింటికి బయలుదేరిన మావారి అవస్తలు అలాంటివండి. బయలుదేరితి పొమ్ము....రిజర్వేషను కంఫాం కాకుండా కంపార్ట్మెంటులో నాతోకలసి కాలు పెట్టనేల! పెట్టితిరిపొమ్ము టీ.సీ కి నాలుగు పాతికలు కొట్టనేల, కొట్టిరికదా అని టీ.సీ చెరొక కంపార్ట్మెంట్లో బెర్త్ లు ఇవ్వనేల, ఇచ్చిరి కదా అని ఆదమరచి నిదురించక అక్కడ ఆయన ఇక్కడ నేను ఆలోచిస్తూ జాగారము చేయనేల?
హమ్మయ్య! ఇక్కడితో ఆగిపోయిందనుకుంటున్నారా? అంత ఈజీగా మిమ్మల్ని వదివేస్తానా చెప్పండి..... తెల్లవారుజామున ఆరుగంటలకి చేరవలసిన రైలు ఎక్కడో గూడ్స్ పట్టాలు తప్పితే ఇక్కడ మా ఎడబాటుని చూడలేక మా రైలు పదిగంటలు ఆలశ్యాన్ని ప్రకటించి మమ్మల్ని ప్రొద్దున్నుండి సాయంత్రంవరకు మాట్లాడుకోమని వదిలేసింది. పొద్దున్నే కాఫీ కడుపులో పడనిదే కబుర్లాడని మావారిపై కేసముద్రంలోని రైల్వే క్యాంటీన్ వాడు కనికరించి కషాయానికి కాస్త ఎక్కువ రుచిగల కాఫీని అందించాడు. అదే మహాభాగ్యమనుకుని తాగిన వారందరితో పాలు అయిపోయినవి అంటూ మరోసారి కాఫీ అడిగినవారికి చిక్కని కాఫీలాంటి చక్కని సమాధానమిచ్చి చల్లగా జారుకున్నాడు.
ఇక్కడ మావారికి కాఫీ కడుపులోకి వెళ్ళి ఖాళీగా ఉండి ఏమిచేయాలో తోచక పేగులతో అనుబందాన్ని పెనవేసుకుని కడుపుని నులిపెట్టి మెలిపెట్టి పదినిముషాలకి ఒకసారి మావారిని టాయిలెట్ కి వెళ్ళేలా చేసింది. ఇంచుమించు కాఫీ తాగినవారిలో చాలా మంది పరిస్థితి అంతే, కాస్త మావారి పై ప్రేమ అధికమై వాంతులకి కూడా దారి తీసింది. పరిస్థితి విషమించక ముందే అక్కడి లోకల్ డాక్టర్ గారి రెండు సెలైన్ సీసాలు, మూడుమాత్రలు, నాలుగు గంటల అవస్థతో కడుపు మొత్తం ఖాళీ అయి కాస్త సర్దుకుంది. నాలుగు గంటలు మావారి విశ్రాంతి, మరో రెండుగంటలు "క్యాంటీన్ మరియు రైల్వే సిబ్బంది" అనే విషయం మీద ఇష్టాగోష్టితో పదిగంటలు గడిచిందంటూ రైలు పరుగు తీసి సాయంత్రానికి గమ్యాన్ని చేర్చింది.
అక్కడ అల్లుడు అడుగిడుతున్నాడని అలకపానుపు ఎక్కనీయరాదని అత్తగారు అరిసెలు, సున్నిఉండలు లాంటి పిండివంటలతో ఆనందింప చేయాలని ఆయాసపడి అమర్చినవన్నీ ఉన్న నాలుగు రోజులు ఒట్టి మజ్జిగన్నం తిని సేదతీరిన ఈయనగారిని చూసి చప్పబడ్డాయి....అల్లుడిగారిని కాస్త అవి ఇవి తిని గట్టిపడమని చెప్పవే అంటూ అమ్మ సలహాలు, అక్కా...బావ మరీ ఇంత సుకుమారుడా! అంటూ చెల్లెళ్ళ చలోక్తులు, మావారి అవస్థలు........మరుసటి నెలలో మొదటి పండుగకి వచ్చినప్పుడు తీరినవి అందరి అచ్చటా ముచ్చట్లు!!!

14 comments:

  1. కష్టాలను కూడా బాగా ప్రెజెంట్ చెసారు

    ReplyDelete
  2. తీరిపోయిన కష్టాలు బాగా నవ్వు తెప్పిస్తాయనడానికి మరో ఉదాహరణ..

    ReplyDelete
  3. పాపం మీ వారిని అలా ఆటపట్టిస్తున్నారా..!!

    ReplyDelete
  4. అయ్యో పాపం .. అంగట్లో అన్నీ ఉన్నాయ్ .. అన్న్న సామెత ఇలాంటి సంఘటనల నించే పుట్టింది

    ReplyDelete
  5. ప్రయాణం చాల romantic ga ఉందండీ !! :P

    ReplyDelete
  6. అవునవును, రైలు ప్రయాణాల్లో ఎపుడూ ఇంతే.
    మీది చదువుతూంటే మా పెళ్ళైన కొత్తలో ఇంచు మించు ఇలాటి అనుభవమే గుర్తుకొచ్చింది.మీ శైలి చాలా బాగుంది

    ReplyDelete
  7. అయ్యో పాపం ..కానీ చాలా బాగా రాసారు

    ReplyDelete
  8. అల్లుడి గారికి పెద్ద ఎత్తునే కష్టం వచ్చిందే.... తీరిపోయిన కష్టాలు తియ్యన కదు... బాగా రాసేరు...

    ReplyDelete
  9. సృజన గారు, ఈ కష్టాలే కదూ, జీవితంలో తీపిగుర్తులుగా మిగిలిపోయి, ఎప్పటికీ తలచుకొనేలా చేస్తాయి.

    ReplyDelete
  10. ఈ మధ్యన మీ టపాల్లేవేమని ఇలా వచ్చేసరికీ....ఇవి...ఎలా మిస్సయ్యానో...
    బాగుంది అత్తవారింట మీవారి మొదటి అవస్థ..!!

    ReplyDelete
  11. ఇలా కామెంట్లలో అసందర్భంగా దూరినందుకు ముందుగా క్షమించండి. దయచేసి ఒక్కసారి http://jeevani2009.blogspot.com/2009/10/blog-post_25.html ను సందర్శించండి పేరును సూచించండి ధన్యవాదాలతో, మీ జీవని.

    ReplyDelete
  12. chaala baagundandi.. kashtale ayina ilantive tharuvatha malli malli gurthu chesukuni kaasepu navvukunettu chestayii.. mee ru raasina vidhanam chakkagaa vundi

    ReplyDelete
  13. అయ్యో పాపం. నిజంగా అది అనుభవించడం కష్టమే. పెళ్లిన కొత్త. మనసులో ఓ వింత ఆనందంతో కూడిన ఉద్విగ్నత ఉంటుంది. అలాంటి సమయంలో ఇలా దూరం, అనారోగ్యం ఎతకష్ట పడ్డారో కదా బావగారు. అలాంటప్పుడే మనలోని ప్రేమ ఉప్పెన మరింత బయట పడేది.

    ReplyDelete
  14. hahahha papam........boss garu baga enjoy/ibbandi padinatlunnaru.

    ReplyDelete