Thursday, May 31, 2012

ఆయనగారి....జిహ్వరుచి!

హాయ్....
పద్మార్పితగారి బ్లాగ్ లో.... 24గంటల్లో క్షణమైనా....
అని పోస్ట్ చదువుతుంటే నా స్మృతులు సవ్వడి చేస్తూ నన్ను మళ్ళీ బ్లాగ్ లో మిమ్మల్నందరినీ  కలుసుకునేలా చేసాయి.
అప్పట్లో నేను ప్రతిగడియా....నా చెంతన శ్రీవారు లేరంటూ తలచుకుని ఉంటే ఇలా చేయాలీ అలా అలగాలి, నన్ను వారు బుజ్జగించాలి అనుకునేదాన్ని. తీరా ఆయనగారు ఎదుటపడితే ఆగకుండా మాట్లాడేదాన్ని.....పాపం మావారికి నోట్లో నాలుక కాస్త చిన్నదేకాని కర్ణభేరి మాత్రం మహాగట్టిదిలెండి :-) అందుకే అలా తట్టుకున్నారు నా మాటల్ని అని మీరు అనుకుంటే నేను బాధ్యురాలిని కానండోయ్!!!
మాంచి ఎండాకాలంలో నేను విజయవాడ వెళ్ళాను. రాత్రి భోంచేసాక ఇంట్లో కరెంటులేదని ఢాభాపైన పరుపేసి పక్కేసి వెన్నెల్లో కబుర్లాడుకుందాం రండి అంటే మావారు శోభన్ బాబు లెవల్లో ఫీలైపోయి ఓ! కమాన్ లెట్స్ హావ్ ప్లెసంట్ నైట్ అంటూ పక్కపై కూలబడి....చెప్పరా ఏంటి విశేషాలు అని అడిగారు.
అడిగారుకదా అని వెంటనే ఏకరువుపెడతానా చెప్పండి! అసలే నాకు కాస్త తెలివిపాళ్ళు ఎక్కువ కదా.....అందుకే అందుకోండి మీకోసం మీకిష్టమైన చికెన్65 అంటూ హాట్ డిష్ వారిముందు పెట్టి నిమ్మకాయ పిండి తినండి (రాత్రి భోజనం తరువాత ఈ సైడ్ డిష్ ఏంటని ఆశ్చయపోకండి అదో రొమాంటిక్ టచ్....దీని గురించి తరవాత చెపుతానులెండి) అనగానే ఆయనగారు వావ్! అంటూ మొదటి ముక్క నోట్లో పెట్టుగోబోతూ పక్కడాబా నుండి మా డాబా వైపు నడచివస్తున్న పిన్నిగారిని చూసి అనుకుని పప్పులో కాలువేయకండి.....పడతిని చూసి ఇప్పుడేం వద్దు కాని ఇక్కడ చాలా చలిగా ఉంది పదా ఇంట్లోకి వెళదాం అన్నారు....చికెన్65 కోడిపెట్టగా మారి కొక్కొరో కో అన్న ఫీలింగ్ .....ఎండాకాలం విజయవాడలో చలా????
ఏదైతేనేం అలా వెన్నెల్లో మా రొమాంటిక్ నైట్ ముగిసి క్రిందకి పక్కా పరుపు అన్ని సర్దుకుని వచ్చేసరికి కరెంట్ వచ్చింది, హాట్ డిష్ లో చికెన్65 చల్లారింది.
ఇంతలా మావారి మూడ్ ని మార్చిన ఆ విషయం కనుక్కోకపోతే కాస్తకూడా క్యూరియాసిటీ లేనిదాన్నని మీరంతా ఆడిపోసుకుంటారని తెలిసి.....చెప్పండి! ఏవైంది మీకు??? అంటూ నుదుటిపై చేయి వేసి నిమురుతూ.....అడిగాను అని చెపితే మీరు ఎలాగో నమ్మరు కదా అందుకే మీ నమ్మకాన్ని వమ్ముచేయకూడదు అని అనుకునేలోపే ఆయనగారు...
ఒకరోజు చలికాలం....అఫీసు నుండి ఇంటికి వస్తుంటే మన పక్కింటి నుండి మాంచి చికెన్ ఫ్రై ఘుమ ఘుమలు నాలో జిహ్వ ఛాపల్యాన్నీ, దానితో పాటు రెండు పెగ్గులు కూడా కొట్టాలన్న కోరికని లేపిందని అందుకే ఒక అరకేజీ చికెన్ ఆవిడని ఫ్రై ( మావారికి వంటరాదనే విషయం మీకు ఆయనగారి మషాలా టీ వలన తెలిసే ఉంటుంది) చేసీయమని చెప్పడానికి నీకు అసలు వంటరాదని నీవు ఉన్నా వేస్టని తనలా చేయలేవని చెప్పి చికెన్ చేయించుకుని తిన్నాను. ఇప్పుడు ఆవిడ నీవు చేసిన ఈ చికెన్65 రుచి చూస్తే నేను అబధ్ధాలకోరుని అనుకుంటుందని అందుకే అలా నన్ను తనతో మాట్లాడనీయకుండా క్రిందకి తీసుకుని వచ్చేసాను అని చెప్పారు, తరువాత ఓ నాలుగైదుసార్లు వండించుకున్న విషయం కూడా దాచారు.
(ఏవండోయ్.......నాకు ఈ విషయమై మీలాగే చాలా డౌట్స్ ఉన్నాయి, కానీ కాపురంలో కొన్నింటిలో క్లారిటీకోసం వెతకడంకన్నా కలసి కిలకిలా నవ్వడం మిన్న:) :) :)...అని వదిలేసాను.