Wednesday, March 10, 2010

అలవాట్లో పొరపాటు

వరంగల్ లో మూడుగదుల పోర్షన్ ని అద్దెకు తీసుకున్న కొత్తలో ఏదో నాలుగురోజులు నా చేతివంట తిని నాకు చేదోడు వాదోడుగా ఉండి ఉద్దరిద్దాము అనుకున్న మావారి అలనాటి ఉద్దంతమండి ఇది.....

ఆ రోజు ఉదయాన్నే లేచి హడావిడిగా తయారై వంటచేసుకుని బాక్స్ లో సర్దుకుని ఇంటి ఓనరు వాళ్ళు మేడారం జాతరకు వెళ్ళారు కదా అన్న అతి జాగ్రత్తలో ఇంటికి ముందు వెనుక కూడా తాళం వేసుకుని వాటిని జాగ్రత్తగా హ్యాండ్ బ్యాగ్ లో వేసుకుని ఈయనగారు ముసుగుతన్ని ఇంట్లో పడుకున్న విషయాన్ని అలవాటులో పొరపాటుగా మరచి ఆఫీసుకి వుడాయించాను. అలవాటులో పొరపాటు అంటే అపార్థం చేసుకోకండి....
అదే ఈయనగారిని శని, ఆదివారం సెలవురోజుల్లో మాత్రమే చూసే అదృష్టమున్న నా కనులకి మెదడు గురు, శుక్రవారాలు ఈయనగారు వున్న విషయాన్ని చేరవేయడం మరచింది అన్నమాట!

పదింటికి నిద్రలేచిన శ్రీవారు కాఫీ....కాఫీ అని అరచిన అరుపులకి వంటింట్లో బోర్లించిన ఖాళీగ్లాసులు వెక్కిరించాయి.
ఆ వెక్కిరింపులతో వాస్తవంలోకి వచ్చిన ఈయనగారు కాలకృత్యాలైనా తీర్చుకుందామని వెనుకవైపుకు వెళ్ళి బోల్ట్ తీయ ప్రయత్నిస్తే ఏముంది నా అతిజాగ్రత్త ఆయనని జాగృతి చేసింది. పక్కింటివాళ్ళని పిలుద్దామంటే వాళ్ళు జాతరకి వెళ్ళారు. నాకు కబురు చేద్దామంటే అప్పట్లో సెల్ ఫోన్లు లేవు, అద్దె ఇంట్లో లాండ్ లైన్ పెట్టించుకునే స్టేజ్ మాది కాదు. ఇరుగు పొరుగు వారిని పిలవడానికి ఈయనగారికి కొత్త....ఏంచేయాలో తెలియక అటుఇటు తలుపుని నాలుగు సార్లు బాది, ఆ పోర్షన్ కి ఉన్న రెండు కిటీకీల్లోంచి ఆరుసార్లు ఎవరైనా కనిపిస్తారేమో అని చూసి, అరచినా ఆలకించేవారు లేరని తెలిసి మంచంపై పొర్లుతూ రెండు గంటలు గడిపిన ఈయనని చూసిన కాలకృత్యాలకి ఈర్ష్య కలిగిందో ఏమో మేమున్నామంటూ ఒకటే గొడవ....దీనికి తోడు పొగత్రాగుట నేరము అనే ప్రక్రియలో భాగంగా ఖాళీ సిగరెట్టు ప్యాకెట్టు ఈయనగారిని చూసి నా వంతుగా నవ్వింది.

ఇంక ఇక్కడ నేను ఆఫీస్ లో డబ్బుల అవకతవకల లెక్కలతో లంచ్ మూడు గంటలకి చేస్తూ కూడా ఎక్కడ లెక్కల్లో పొరపాటు జరిగిందో కదా అని ఆలోచిస్తూ.....నాలుగున్నరకి టీ త్రాగుతూ మావారికి ప్రీతిపాత్రమైన వాటిలో టీ కూడా ఒకటి కాబట్టి అది నాకు మావారు ఇంటివద్ద ఉన్నవిషయాన్ని గుర్తుచేసి ఋణం తీర్చుకుంది!
వెంటనే చేసిన పొరపాటు తెలుసుకుని ఆటోలో ఇంటికి వెళ్ళి తాళం తీసిన ఈయనగారి తిట్లకి రెడీగా వినడానికి వేచివున్న నా చెవులకి ఒక్క మాటకూడా వినిపించలేదు, నేను క్షమించమని అడిగేలోపే ఈయనగారు ఒక్క ఉదుటన నా చేతిలోని తాళాలగుత్తిని లాక్కుని వెనుక వైపుకి పరిగెత్తారు.తరువాత విషయం ఏం జరిగి ఉంటుందో మీ అందరికీ నేను రాయకపోయినా అర్థమై ఉంటుందని నాకు తెలుసులెండి.