Thursday, January 17, 2013

నా ఎవర్ గ్రీన్ హీరో

వయసులో ఉన్నప్పుడు వెలగబెడితే విడ్డూరం కానీ వయసొచ్చాకైతే ఇలాగే ఉంటుంది......ఇదేంటి రాక రాక వస్తూ ఇలా అని తిట్టుకోకండి!
మొన్నామధ్య మేము ఢిల్లీ వెళ్ళినప్పుడు మావారు వెలగబెట్టిన రాచకార్యం చెబితే మీరేమంటారో మరి....
AP ఎక్స్ ప్రెస్ ఎక్కిన రెండుగంటలకి కాజీపేట్ రాగానే మళ్ళీ రైలు ఇంక ఆగదు అన్నట్లుగా ఆత్రంగా దిగి దమ్ముకొట్టి అక్కడ ప్లాట్ ఫాం పై ఉన్న దుమ్మురేపుకుంటూ సిగ్నల్ ఇచ్చాక బండి ఎక్కి ఆయాసం తీర్చుకుంటుంటే చెప్పాను....ఇలా ఎందుకండి ప్రతి స్టేషన్ లో దిగి దమ్ము కొట్టడం అని, మౌనంగా ఒక నవ్వు నవ్వి ఢిల్లీలోని జంతర్ మంతర్ చూడ్డం అవసరమా అంటూ అనవసరమైన టాపిక్ లేవనెత్తేసరికి మా అమ్మాయి అయోమయంగా వాళ్ళ నాన్నని చూస్తూ దమ్ముకొడితే ఇలా వింతగా ప్రవర్తిస్తారు కామోసును, నేను పెద్దగైయ్యాక కొట్టి చూడాలి అన్న ఎక్స్ ప్రెషన్ ఇస్తూ వద్దులే అమ్మా అంటూ ఐపోడ్ ఆన్ చేసింది (ఎంతైనా అది వాళ్ళ నాన్న కూతురుకదండి)!
మధ్యాహ్నం భోజనం చేసాక నేనిచ్చిన డోసో లేక ట్రైన్ ఆగని కారణమో కాసేపు కునుకు తీసి ఎవరో కొట్టి లేపినట్లే నాగపూర్ స్టేషన్ లో బండి ఆగడం తోటే చెంగున ప్లాట్ ఫాం పైకి గెంతుతూ తూలి పడబోతూ నిభాళించుకున్నారు. బాడీ సిక్స్ ప్యాక్ ఉంటే సరిపోతుందా స్టామీనా తగ్గాక అంటే వినరని తెలిసి కిమ్మనకుండా ఇష్ష్.......అనుకున్నా! ఇదేం పట్టించుకోని మావారు దేవానంద్ హెర్ స్టైల్ ఇంకా తన తలపై ఉన్నదన్న తలంపుతో బాల్డ్ హెడ్ ని సరిచేసుకుంటూ టీస్టాల్ దగ్గరకి ట్రాన్స్ లో వెళ్ళి ఓ నాలుగు సిగరెట్లు రెండు టీలు తాగి అక్కడున్న హల్దీరాం యాడ్ ఫోటోలని చూస్తూ కోడిని చూసి కోటాశ్రీనివాస్ లొట్టలు వేసినట్లుగా వేస్తూ ట్రైన్ కి సిగ్నల్ ఇచ్చిన విషయం మరచి చివరి బోగీ ప్లాట్ ఫాం వీడుతుంటే పరుగెట్టి పరుగెట్టీ పట్టుకోలేక పడబోతుంటే పాంట్రీ కార్ వాళ్ళు పైకి లాగి నీళ్ళిచ్చి నాలుగు చివాట్లు పెట్టి ఉంటారులెండి ( మేల్ ఇగో తో ఇవి చెప్పరు కదా:-)
అక్కడలా.....ఇక్కడ అరగంటైనా ఈయన రాకపోయేసరికి కంగారు ట్రైన్ ఎక్కారో లేదో అక్కడే ఉండిపోయారో అని, మొబైల్ రింగ్ అవుతుంది కాని రిప్లై లేదు. తోటిప్రయాణీకులొకరు చైన్ లాగమంటే ఇంకొకరు కంగారెందుకు ఎక్కుంటారని అంటున్నా కంగారు పడుతున్న మనసు నా కూతురి కళ్ళనిండా నీళ్ళని చూసేసరికి కలవరపడి చైన్ లాగబోతుంటే ......గుండెని జేబులోనుండి జారిపోకుండా పట్టుకున్నట్లుగా బేలముఖానికి కవరింగిచ్చుకుంటూ "సారీ రా పండూ" అంటే ఏమనగలను ఐస్ అయిపోయాను!
టైన్ లో ప్రొగతాగితే జరిమానా అనేది ఎవరికెంత వర్తించిందో తెలీదుకానీ పరుగెడుతూ ట్రైన్ ఎక్కబోతూ బ్లాక్ బెరీ సెల్ ని మాత్రం జారవిడుచుగోవలసి వచ్చింది.