Thursday, November 1, 2012

మావారి మిర్రర్ మిస్టరీ


గత రెండు నెలలుగా ఏదైనా ఒక స్మృతి సవ్వడిని మీకు వినిపిద్దాం అనుకుంటే మావారు ఒక్కక్షణమైనా నన్ను ఖాళీగా ఉండనిస్తే కదండి రాయడానికి........
ఆగండాగండి!!! ఇదేదో సెన్సార్ బోర్డ్ వాళ్ళకి అప్పగించవలసిన మాటర్ అని మాయమైపోకండి. అచ్చుతప్పు సరిచేసి చదువుకోండి ఆయనగారిని నేనే వదలడంలేదు, మళ్ళీ సెన్సార్ అనకండి.....:-) నేనే వారిపై నిఘా వేసి ఉంచాను అంటే కాస్త హాలీవుడ్ చిత్రంలా అర్థంకాక బాగుందన్నట్లుంది...ఇలా ఫిక్స్ అయిపోండి.

ఇంతకీ విషయంలోకి వస్తే......ఇంతకు ముందు హీరో లాగున్నప్పుడు ఈసుమంతైనా స్నో కానీ పౌడరు కానీ ముఖానికి రాయని వారు ఈ మధ్య తెగ అద్దం ముందు నించుని ముఖాన్ని "ఎగ్సార్సిస్ట్" సినిమాలో దెయ్యం తల గుండ్రంగా తిప్పినట్లు తిప్పుకుని ఒకటే చూసేసుకుంటున్నారు....నేను వెళ్ళేసరికి ఏంటంటూ నన్ను ప్రశ్నిస్తుంటే, సదరు భార్యగా అనుమానించి నిఘావేయడం తప్పుకాదని మీరంతా నాకు వత్తాసు పలుకుతారని తెలిసి మిమ్మల్ని బ్లాగ్ లో కలవకుండా ఆయనపై ఇంటిదగ్గర నా రెండు కళ్ళని, ఆఫీసులో మరో నాకు తెలిసిన నాలుగు మగకళ్ళని (ఆడకళ్ళైతే మళ్ళీ రిస్క్ అని) ఆయన్ని వెంటాడవలసిందిగా కోరితే అనవసరంగా నన్ను చూసి ఆ నాలుగుకళ్ళు ఇంకో ఎనిమిది కళ్ళకి మసాలా అద్ది కధలల్లుకుని నవ్వుకునే ఆస్కారం ఇవ్వడానికి దోహదపడిందేకాని మావారి మిర్రర్ మిస్టరీ అంతుచిక్కలేదు.

అంతుచిక్కని వాటి అంతుచిక్కించుకోనిదే నేను ఊరుకుంటానా.....నేనూరుకున్నా నా నిద్ర నన్ను లేపి లేపి చేస్ చేస్ అని తరిమి తరిమి కొడితే.....ఒక రోజు రాత్రి రెండు గంటలకి డ్రెసింగ్ రూం లో లైట్ వేసుంది. ఈయన చూస్తే పక్కనలేరు, ఇది పక్కాగా మావారు పరాయి పతివ్రతతో పలాయనం చిత్తగించే ప్లాన్ లో ఉన్నారని ఎలాగైనా ఫాలో అయ్యి పట్టుకోవాలని కర్టెన్ వెనుక నక్కి చూస్తున్నా పావుగంటైనా ఒక పలుకులేదు ఉలుకులేదు ఎవరో మూగదాన్నే వలవేసి పగడ్బందీగా పట్టారనుకుని వంగి చూస్తే ఏముంది మళ్ళీ ఆ "ఎగ్సార్సిస్ట్" దెయ్యం తలా తిప్పికుంటూ మూడు రకాల దువ్వెనలతో తలదువ్వేసుకుంటూ ముఖంలో వింత ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ విచారంగా ఉంటే ఆగలేక వెళ్ళి ఏమైందండీ ఈవేళప్పుడు ఇలా అని అడిగి సుతారంగా నా చేతివేళ్ళని  నుదుటిపై నుండి జుట్టులోకి పోనివ్వబోతుంటే......కెవ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్ కేక ఆపు వద్దు అంటూ!!! నేను భయపడి వెనక్కి పడబోతుంటే పాతికేళ్ళ వివాహబంధం ఆయన చేతులరూపంలో నన్ను ఒడిసిపట్టుకున్నాయి.

నా ఆత్రుత ఆయనకి అలవాటేగనుక అడక్కుండానే వివరించారిలా......ఒసేయ్ నా మేలిమి బంగారం! నేను నల్ల బంగారాన్నని తెలిసి కూడా నీవు నా నిగనిగలాడే రింగుల జుట్టుని లవ్ ఆడావిని తెలుసు. ఈ పాతికేళ్ళలో నీవు నాజుట్టులో నీ వేళ్ళు సుతారం పోనిచ్చేలా ప్రేమగా చూసుకున్నానే కాని నువ్వు జుట్టు పట్టుకుని పీకే ఆస్కారం నీకివ్వలేదంటే నా ఉంగరాలజుట్టుపై నాకున్న మోజు....

అటువంటిది ఇప్పుడు ముందు పావు వెనుక అర్థ భాగం పోయి ఈ మిగిలిన వ్రెంటుకలు కూడా గట్టిగా గాలి వీస్తే ఊడిపోతున్నాయి.......మేనమామ ఆస్తి నాకు సంక్రమించింది కాబట్టి ఇంకో ఏడాదిలో 101 వ్రెంటుకల వ్రతం అని నువ్వు ఒక పోస్ట్ రాసుకునేలా ఉంది నా ఈ జుట్టు పరిస్థితి. దీనికి పరిష్కారమంటూ రోజుకొక మెసేజ్ మొబైల్ లో బట్టతలా??? రండి రండంటూ.....దాని పర్యవసానమే ఇలా నీకు తెలీకుండా..... (మావారిపై నేను అనుమానపడ్డందుకు నన్ను నేను తెలుగు, తమిళ్, మళయాళం, హిందీ లో ఉన్నతిట్లన్నీ తిట్టుకుని) పైకి మీకు బట్టతల ఉంటే నాకు ఇంకా ఇష్టమండి ఎందుకంటే నా అభిమాన నటుడు అనుపంఖేర్ లా ఉంటారు మీరు అప్పుడు.....యు ఆర్ మై బ్లాకీ అనుపంఖేర్ అండి అని అంతులేని ఆత్మ విశ్వాసాన్ని అందించాను.
ఆత్మ విశ్వాసాన్నైతే ఇచ్చాను కానీ.....అర్థరాత్రి అపరాత్రి లేచి క్రాపుని నీట్ గా దువ్వుకుని నిదురపోవడంలోని ఆంతర్యమేమిటో అంతుచిక్కలేదు????