Tuesday, June 30, 2009

ఆషాఢం ఆఫర్!!!

ఆషాడమాసం వచ్చిందంటే నేను పైన సూట్ కేసులో నుండి నాకు మాశ్రీవారు కొనిచ్చిన చిలకాకుపచ్చరంగు పట్టుచీరని తీసి చూసుకోకుండా, శ్రావణమాసానికి చీరకొనుక్కోనండీ!! అని చెబితే మీరు నమ్మాలండీ.....ఎందుకంటారా?
సరే మరైతే ఇంకెందుకు ఆలశ్యం ఒక్కసారి నా సృతుల సవ్వడి వినండి మరి!!!

శనివారం విజయవాడలో బస్సెక్కి వరంగల్ వద్దామని బయలుదేరిన మావారు బస్సు ఇంకా బయలుదేరడానికి అరగంట పడుతుంది అని తెలిసి టీ తాగి ఒక దమ్ము కొడదామనుకుని బస్టాండ్ నుండి బయటికి వస్తుంటే "అయ్యగారండీ.....ఒక్కనిముషం" అన్న మాటతో వెనుదిరిగి చూసారు. ఒక ముప్పైఏళ్ళ వయస్సున్న యువతి నా దగ్గర రెండు కొత్త కంచి పట్టుచీరలు వున్నాయండి మీకు కావాలాండి అని అడిగిందట. నన్నే ఈవిడ ఎందుకు అడిగిందా అని ఆశ్చర్యపోతున్న (బహుశా మనసులో మురిసిపోతు) మావారి మనసునెరిగి ఆవిడ నా పర్సుని ఎవరో కొట్టేసారండి ఇప్పుడు నేను బస్సు ఎక్కి వెళ్ళకపోతే మళ్ళీ రాత్రి పొద్దుపోతుంది ఇంట్లో కంగారు పడతారు, షాపుకి వెళ్ళి తిరిగి ఇచ్చే టైము లేదు అందుకని మీకు నచ్చితే తీసుకోండి అంటూ రెండు అందమైన అమ్మాయిల బొమ్మలున్న అట్టపెట్టెలని చేతిలో పెట్టింది. అట్టపెట్టె మీది అమ్మాయిలే నచ్చారో లేక అందులోని చిలకాకు రంగు చీరే నచ్చిందో కాని ఆమె పదిహేను వందలు అనగానే ఇంకో మాట అనకుండా టక్కున డబ్బులు ఇచ్చేసి పట్టుచీరను చట్టుక్కున లాక్కొని చిటుక్కున బస్సెక్కేసారు......

ఇంటికి రాగానే ఏమోయ్! నీకోసం ఏం తెచ్చానో చూడు అంటూ నాకు అందించిన అట్టపెట్టెని చీర అని అంచనా వేసి...... భోంచేసాక చూస్తానులెండి మీరు అలసి పోయారు స్నానం చేసిరండి అంటూ వంటింట్లోకి వెళ్ళి హడావిడిగా హల్వా తయారు చేసాను.....ఎందుకనో మీకు వేరే చెప్పాలటండీ?(పట్టుచీర తెచ్చి నందుకు పాలిష్)....ష్ ష్... ఇలా నిజాలని బయట పెట్టకండీ!
భోజనాలు అయ్యాక పదిరోజుల్లో శ్రావణమాసం వస్తుంది కదా! అప్పుడు కట్టుకుంటానండి అంటూ చిలకాకుపచ్చకి ఎర్రని అంచున్న కంచిపట్టు కోకకి కొంగు ఎలావున్నదో కదా అని కోరికతో మడత విప్పిన నేను...చూస్తున్న మావారి నోటి నుండి ఒకేసారి ఆ!! అనే శబ్ధం చుట్టూ నిశ్శబ్ధం....


ఇదీసంగతి!....చిలకాకు పచ్చ రంగున్న పట్టుచీర కాదు పట్టు పరకిణీ అయినా బాగుండేది అదీ కాదు పట్టు బ్లౌస్ కి కాస్త ఎక్కువ టవల్ కి కాస్త తక్కువ అయిన ఎర్రంచు పట్టు పీలికని పేపర్ల పైన మడతపెట్టి పెట్టెలో పెట్టి....... ఇంక ఎందుకులెండి అసలు విషయం తెలిసింది కదా!!!!


Tuesday, June 16, 2009

శ్రీవారితో సినిమాకి!

అది పెళ్ళైన వారం రోజులనాటి సవ్వడండి........
ఏదో మావారికి కూడా అందరిలాగే వాళ్ళవిడతో సినిమాకి వెళ్ళాలని తెగ ముచ్చటపడి "చూపులు కలసిన శుభవేళ" సినిమా టిక్కెట్లు రెండు సంపాదించి నన్ను త్వరగా రెడీ అవ్వమని హాల్లో టీ.వి చూస్తూ కూర్చున్నారు. నేను తెగ సంబర పడిపోయి అత్తయ్యగారు అథితుల మధ్యలో ఉండగా ఈ కబురు చెప్పాను. ఆవిడ సరే అన్నారు కాని తొమ్మిదో తరగతి చదువుతున్న మా చిన్ని ఆడపడచు నేను కూడా రానా వదినా అంది, నాకు రెండు టిక్కెట్లు మాత్రమే వున్నాయనే విషయము తెలియక సరే రమ్మన్నాను. ఇది విన్న మా పెద్దాడపడచు పిల్లలు మేము మరీ అంటూ బయలుదేరారు. నా ఇద్దరు మరుదులు బేల ముఖంతో నిలబడితే నేనే వాళ్ళని కూడా రమ్మన్నాను. మేమేం పాపం చేసామంటూ మావారి మేనత్త పిల్లలు కూడా బయలుదేరారు.....పదండి! అంటూ అడుగిడిన నన్ను చూసి మురిసి పోయారో లేక నా వెనుక వున్న దండుని చూసి మూర్చపోయారో!....చూసేలోగా మావయ్యా పదా... అంటూ ఐదేళ్ళ మేనల్లుడు చేయిలాగేసరికి చేసేదిలేక పదండి అని కదిలారు.
తరువాత కధ మీకు తెలిసిందే..... ఆ సినిమాకి టిక్కెట్లు ఇంత మందికి ఇవ్వలేమంటూ ప్రక్క థియేటర్ లోని సినిమా కలక్షలని కాస్త పెంచమంటే ఆ పుణ్యకార్యం కూడా చేద్దాం పదా అనుకుని అందులో కూర్చున్నాము....సినిమా అప్పటికే మొదలై పావుగంట... మాలాగే టిక్కెట్లు దొరకని దురదృష్టవంతులతో హాలు నిండింది. నీతో సరదాగా సినిమా చూడాలి అనుకుంటే పిల్ల కోడిలా వీళ్ళందరినీ వెంటబెట్టుకుని బయలుదేరావా! అని అన్న మాటలకి సమాధానము చెప్పేలోపు.........అన్నయ్యా! చూడు నా ప్రక్క సీటు వాడి వెకిలి వేషాలు అంటూ ఫిర్యాదు. వెంటనే ఈయనగారు వెళ్ళి ఆ చివర కూర్చుంటే ఎనిమిది మంది ఎడమలతో ఈ చివర నేను. పిల్లలందరూ సినిమా చూస్తుంటే..... ఏడవలేక నవ్వుతూ ఈయన నన్ను చూస్తున్నారు.....నా ప్రక్కన కూర్చున్న చిన్నోడికి డౌట్లు చెప్పి ఈయన వైపు సినిమావైపు ముచ్చటగా మూడుసార్లు చూసేసరికి........తెరపై విశ్రాంతి.
అందరికి అల్పాహారాలందించి ఏదో గుర్తుకు వచ్చినట్టుంది నాకిష్టమైన మసాల బఠాణీల ప్యాకెట్టుని నాకివ్వమని ఆయన ప్రక్కనున్న చెల్లెలి చేతిలో పెట్టడము.....పిల్లలు అక్కడ తెరపై హీరో విలన్లని కుమ్ముతుంటే ఈ ప్యాకెట్టు చేతులు మారి నా చేతిలోకి వచ్చే సరికి వెల రు.15 అనే నూనె కాగితము, తెరపై గ్రూప్ ఫోటోతో సినిమా అంతము.
కొసమెరుపు: ఉదయం టిఫిన్ తింటూ పిల్లలందరూ వదిన మంచిదని, అత్తయ్య నాకు కావాలని,నా ప్రక్కన కూర్చోవాలంటే... నా ప్రక్కన అంటూ వాదించుకుంటుంటే, మా అత్తగారు అమ్మాయి ఎంతో కలివిడిగా కలిసిపొయింది రా అని ఈయనతో అంటుంటే విని ఈసారి మనమందరం కలసి వెళదామండి అత్తయ్యగారూ! అన్న మాటలకి పొలమారిందో లేక ఇడ్లీలో అద్దుకున్న కందిపొడి గొంతులో అడ్డుపడిందో!!!!!!

Friday, June 12, 2009

మంచి దొంగ

అవి నేను ఉద్యోగంలో కొత్తగా చేరిన రోజులు, వరంగల్ లో ఒక పోర్షన్ అద్దెకు తీసుకుని ముగ్గురు స్నేహితులము కలసి ఉండేవాళ్ళము.
నా స్నేహితులిద్దరూ వాళ్ళ ఇళ్ళకు వెళితే నేను ఒక్కదాన్ని బోర్ కొడుతుందని తలుపు తాళం వేసి గొళ్ళెం మరచి పక్కింట్లో టి.వి చూస్తూ కూర్చున్నాను. 'స్వర్ణకమలం' విశ్వనాధ్ గారి సినిమా నేను ఎన్నిసార్లు చూసినా చూడాలనిపిస్తుంది, అర్థం చేసుకోరూ!!!!
మీరు అర్థం చేసుకున్నరో లేదో కాని నాకు వంటచేసి పెట్టినవాడు మాత్రం బాగా అర్థం చేసుకున్నాడేమో.......
మా పోర్షన్ గొళ్ళెం తీసి వంట చేసుకుని వాడు చక్కగా కొత్త ఆవకాయతో అన్నం ఆరగించి నాకు కూడా కాస్త ఉంచిచాడనుకోండి!!! నా హ్యాండ్ బ్యాగ్ లోని డబ్బులు జీతం మొత్తం తీసుకుని, 3 రూపాయిలు నాకు మరునాడు బస్సు కోసం అని చిల్లర ఉంచి...అక్కడ టేబుల్ పైన ఉన్న పుస్తకాల్లో నుండి యండమూరిగారి అభిమాని అనుకుంటాను పాపం.......'ప్రార్ధనా, 'డైరీ ఆఫ్ మిస్సెస్స్ శారద ' అనే రెండు నవల్లను తీసుకుని మిగిలిన పుస్తకాలు చక్కగా సర్దిపెట్టాడు. వెళుతూ వెళుతూ ఏమనుకున్నాడో గిన్నెలు కడిగి బోర్లించిన గిన్నె క్రింద చిన్ని కాగితంపైన,
సమయ భారం వలన కూర చేయలేదు పచ్చడితో సరిపెట్టుకోండి అని వ్రాసి మరీ వెళ్ళాడు. ఎంతైనా మంచిదొంగ కదండీ!!!
ఈవిడ ఏంటి వాడు అంటుంది, అది అయ్యివుండవచ్చు కదా అనుకుంటున్నారా? మంచి దొంగ సిగరెట్ ప్యాకెట్ వంట గదిలో మరచి పోయి వెళ్ళాడు. అది అయ్యివుంటే మా ముగ్గురి చీరలకి రెక్కలు వచ్చి వుండేవి......ఏవంటారు!!!
ఏమైతేనేమీ మంచి దొంగే అంటారు!!!