Saturday, May 8, 2010

"ఆహా ఆవకాయ"

అమ్మ అయినా అత్త అయినా ఈసారి ఆవకాయ నేనే పట్టి పంచి అందరి దగ్గరా మంచి మార్కులు కొట్టెయ్యాలి అన్న ఆలోచన వచ్చిందే తడువు "ఊరగాయలు-పచ్చళ్ళు" మీద రాసిన గ్రంధాలని అన్నీ తిరగవేసి ఆఖరికి "కాంతామణి వంటలు" అనే పుస్తకంలోని చేయువిధానము ఆవిడ వ్రాసిన ఉపోద్ఘాతము నాకు యమగా నచ్చి అలాచేయాలి అని ఫిక్స్ అయిపోయాను.

ఈయనగారికి చెపితే నీకు ఎందుకు ఆ శ్రమ హాయిగా అమ్మో, అత్తయ్యో పట్టిన పచ్చడిని ఆరగించి ఆనందించక అని నాకు ఒక ఫ్రీ సలహాని పడేసారు. అలాచెప్పిన వెంటనే వింటే ఇలా నా స్మృతి పధంలో "ఆహా ఆవకాయ" చేరేదా చెప్పండి!

ఊరగాయలకి, ఊరమిరపకాయలకి సెలవు ఇవ్వరు అని తెలిసి మా బాస్ మెచ్చి సెలవు ఇచ్చే విధంగా నాలుగు అబద్దాలాడి సెలవు తీసుకుని అటునుండి అటే బజారుకి వెళ్ళి కారంపొడితో పాటు కావలసిన సరుకులన్నీ తీసుకుని ఇంటికి వచ్చి కాంతామణిగారి వంటల పుస్తకాన్ని మరొక్కసారి చదివి ఒక్కపదం కూడా వదిలివేయకుండా ఆవిడ చెప్పినట్లు అన్నీ సమపాళ్ళలో వేసి పప్పునూనె వేసి చేతితో కలిపి జాడీలోకి ఎత్తుదాం అనుకుని అమ్మ ఎప్పుడో అన్న మాటలు గుర్తుకు వచ్చి వద్దులే అని గరిటతో కలిపి జాడీలోకి ఎత్తి మూడవరోజు(అపార్ధం చేసుకోకండి) కోసం ఎదురుచూసా పచ్చడిని కలిపి అందరికి పంచాలని. ఆరోజు రానే వచ్చింది ఉదయాన్నే తలంటుకుని భగవంతునికి నమస్కరించి ఊరగాయ జాడీని తీసి గరిటతో కలిపితే చక్కని ఎరుపురంగుతో పైన పప్పునూనె తేలుతూ చూడముచ్చటగా వుంది. ఊరగాయజాడీని లాంగ్ షాట్ లో క్లోజప్ లో చూసుకుని మరీ మురిసిపోయాను. ఎందుకు అంత మురిసిపోవడం అంటారా.... మా అమ్మమ్మ చెప్పేది ఊరగాయని కలిపేటప్పుడు తేలిన రంగునిబట్టి దాని రుచి చెప్పవచ్చని, అలా చూస్తే ఇంక నా ఆవకాయ రుచికి తిరుగులేదని తేలిపోయింది కదండి! అదన్నమాట.
ఆదివారం ఆరు హార్లిక్స్ సీసాలను తీసుకుని కడిగి తుడిచి ఆవకాయని అందులోకి తీసి....అమ్మకి, అత్తయ్యకి, పిన్నికి, చెల్లికి, మా ఇద్దరు మరుదులకి ఇచ్చి వారి నుండి కమెంట్స్ కోసం కాటికాడ నక్కలా(ఉపమానం బాగాలేదు కాని ప్రాస కుదిరిందని) ఎదురుచూసాను.

సాయంత్రం ఆరుగంటలకి అమ్మ ఫోన్...అమ్మాయ్ నీకు పుట్టింటి మీద మమకారం కాస్త ఎక్కువేమోనే ఆవకాయ రంగు అదిరింది కానీ అస్సలు కారమేలేదు అంటూ....
ఏడు గంటలకి అత్తయ్యగారు....ఆవకాయలో కారం వేయడానికి బదులు హోలీ రంగు ఏమైనా కలిపావా అంటూ....
పిన్ని...పిచ్చిదానా ఎక్కడో ఏదో పొరపాటు చూసుకోమంటూ....
చెల్లి...నీకు ఈ ప్రయోగాలు ఎందుకే అంటూ....
మరుదులు...మేమింకా రుచి చూడలేదంటూ....

ఆలోచిస్తే***ఆవకాయలో అన్నీ కరెక్టుగానే వేసాను బజారులో కొన్న కల్తీకారంతో పాటు....అది కారం కాదు రంపంపొడిలో రంగు కలిపారని అందుకే దానికి రంగు తప్ప రుచిలేదని. ఆ షాపువాడి దగ్గర డబ్బులు వసూలు చేసాననుకోండి అది వేరేసంగతి. అలా ముగిసింది నా ఆవకాయ పట్టాలన్న ఆలోచన. అప్పటి నుండి ఇప్పటి వరకు మరలా ప్రయత్నించలేదు ఏ ప్రయోగం పచ్చళ్ళపై చేయలేదు.అడుకున్నే వాడికి అరవై కూరల్లాగా....అమ్మ, అత్తయ్య అభిమానంతో ఇచ్చే ఆవకాయతో అటు ఆరు, ఇటు ఆరు నెలలు గడిచి పోతున్నాయండి.