Monday, October 21, 2013

"పుస్స్ పుస్స్"

లాంగ్ లాంగ్ ఎగో అప్పుడెప్పుడో........స్నాక్స్ ఏమైనా వేడివేడిగా చేసి పెట్టొచ్చుకదా చక్కగా చినుకులు పడుతుంటే కిటికీలో నుండి చూస్తూ తింటాను అని కోరక కోరక కోరిన కోరికని కాదంటే......భార్యా భాధితుల సంఘాలన్ని స్నాక్స్ నిరహారదీక్ష చేసి నాకు "అప్రతివత" అన్న బిరుదును ఎక్కడ అంటగట్టేస్తారో అని అలోచించా.....లోచించా......చించా!
చివరికి ఓ కొంగ్రొత్త వంటను మావారి చేతికందించి కంచిపట్టుచీరను కోరడం కామన్ అని తలచి కాపర్ కలపని KDM కడియం ఒకటి కోరాలని కార్యక్రమనికి క్లవర్ గా మొదలుపెట్టా....
సూక్ష్మంలో మోక్షం తెలిసిన తెలివైన భార్యని కదా....... గోధుమపిండిలో కూసింత మైదా ఇంకా పనిలో పనిగా రాగిపిండి బియ్యప్పిండిని కూడా కలిపేసి చిటికెడు ఉప్పువేస్తుంటే......ఛస్ ఇదేం వంటకం అనుకుని బెల్లం డబ్బా అందుకుని నా గుప్పెడంత గుండె సైజ్ లో బెల్లాన్ని పిండిలో వేసి కలిపాను తియతీయగా ఉప్పు ఉప్పగా అందిస్తే అదుర్స్ అని........(అసలు విషయం మావారిపై ప్రేమ తీపిపాళ్ళు ఎక్కువని మరోగుప్పెడు బెల్లాన్ని చేర్చి పిండిని కలుపుతూ కడియమున్న నా చేతిని నేనే  ఊహించుకున్నాలెండి) వంటలోకి వెళితే ఏముంది.....పిండికాస్త సాంబార్ కన్నా కాస్త చిక్కగా ముద్దపప్పుకన్నా పలుచగా తయారైంది. అయ్యో అని వ్యర్థం చేయడం నా ఇంటా వంటా లేదని......వేడిగా కాగిన నూనె బాణాలిలో నూనెలో గుంటగరిటేతో వడియాలలా వేసేసరికి అవి పరవశంగా "పుస్స్ పుస్స్" మని పొంగాయి. ఆ తరువాత????????
ప్లేట్ లో అందంగా అమర్చి మావారికి నవ్వుతూ అందిచేసరికి ఆహా ఓహో.....అమోఘం మా ఆవిడ అడగ్గానే అదేదో చేసివ్వడం అని తినబోతుంటే వర్షం ఆగిపోయి కరెంటు పోయింది.
ప్చ్ :-( .......ఇంకేం మావారి ఫేస్ ఎక్ప్రెషన్స్ చూడను, KDM కడియం కావాలని కోరను? 

అలా ముగిసింది ఆనాటి జ్ఞాపకం!

Friday, August 9, 2013

సరసాల మొగుడు-సరదా పెళ్ళాం

అప్పుడెప్పుడో చెప్పాను........ఏవండి! సరదాగా ఓ షికారులేదు, సరసం అంతకన్నా కరువైంది ఈ మధ్య అని, దానికి పర్యవసానంగా మొన్న కారులో షికారుకి వెళదామా అని అడిగారు ఎప్పుడూ ఎనిమిదింటికన్నా ముందురాని మా శ్రీవారు అయిదు గంటలకే ఇంటికొచ్చి.
మా బాస్ కి ఈ విషయం తెలిసో తెలియకో నేను పరిమిషన్ అడిగిన వెంటనే ఇవ్వడం వలన నేను ఇంటికి నాలుగు గంటలకే వచ్చేసాను. మా ఇద్దరి మూడ్ లే కాకుండా అన్నీ కలిసిరావడంతో బయటికి వెల్లడానికి నిశ్చయించుకుని త్వరగా తయారవ్వాలన్న తొందరలో చుడీదార్ వేసుకోబోతుంటే వద్దు వద్దంటూ అప్పుడెప్పుడో ఆయన కొనుక్కొచ్చిన తెల్లని దానిపై చిన్ని వంగపూవులున్న షిఫాన్ చీర కట్టుకోమన్నారు. అలా కోరిన వెంటనే నేను చేయడం పరిపాటే అయినా కాస్త సరదాలు తెలిసిన దాన్ని కదండి..... అందుకే నేను కూడ ఎప్పుడూ ఆ ప్యాంట్ షర్ట్ లేనా అంటూ జీన్స్ వేసుకుని టీ-షర్ట్ వేసుకోండి అన్నాను. నా గొంతులోని గోము తెలిసిన ఏకై వ్యక్తి ఆయన, గొప్పగా ఫీల్ అయిపోయి అలాగే అంటూ అవి ధరించి తలపై ఉన్న నాలుగు వెంటుకల్ని వందసార్లు దువ్వుకుంటూ.......నాతో, ఆ తలకి క్లిప్ పెట్టుకోకు ఓనాలుగు అల్లికలు అల్లుకుని జడవేసుకో దారిలో మల్లెపూలు కొనిస్తానుగా అన్నారు. అమ్మో.....ఏంటి ఈ ప్రణయ ప్రకంపనం అనుకోలేదు ఎందుకంటే మావారి సరసం నాకు తెలుసు కదండి! అదీ కాకుండా మల్లెపూల సీజన్ ఇంకా కొనసాగుతుందిలే అని జడవేసుకుని చీరకుచ్చీళ్ళు సర్దుకుంటూ ఆయన ముందు నిలబడగానే "కట్టుకున్నా అదే చీర పెట్టుకున్నా అవేపూలు" అనే పాటని ఊహించుకుంటూ శోభన్ బాబు వాణీశ్రీని "పొగరుబోతు" సినిమాలో చూసిన లెవెల్ లో ఊహించుకుంటూ అటునుండి అలాగే ఏదైనా సినిమాకి కూడా వెళదామంటూ చెంపను గిల్లాబోతుంటే.....ఆలస్యం ఎందుకు పదండి అంటూ బయలుదేరాము.
నమస్తే సార్ అన్న అపార్ట్మెంట్ వాచ్ మెన్ తో....మల్లేష్ వాడెవడో మొన్న కార్ పై పాన్ ఉమ్మాడు, నిన్న పిల్లలు గీతలు గీసారు నువ్వు సరిగ్గా చూడ్డంలేదు అంటూ లిస్ట్ చదువుతుంటే.....ఇది సెకండ్ షో అయిపోయినా తీరేది కాదని తెలివిగా ఏవండి మార్కెట్లో మల్లెపూల మాలలు అయిపోతాయి పదండి అని మెల్లిగా కన్నుగీటి చేతిపై గిల్లాను. మంచి మూడ్ లో ఉన్న మావారు కార్  స్టీరింగ్ ని స్టైల్ గా తిప్పుతూ రోడ్డున పడ్డారు. నేను గట్టిగా ఊపిరి పీల్చుకుని హమ్మయ్య  అనుకున్నాను.
మాటతప్పని మావారు మల్లె పూలకోసమని మార్కెట్లో దిగి మూరెడు మల్లెలతో పాటు  బేకిరీలో నాకు ఇష్టమని చాకోబార్ ఐస్ క్రీంతో పాటు ఒక కుల్ఫీ కూడా తీసుకుని పూలమాల నాకిచ్చి ప్యాకెట్ దాచేసారు. ఓ అరగంట సిటీలో లాంగ్ డైవ్ చేసి నెక్లెస్ రోడ్ ఎక్కేసరికి అక్కడ ఎక్కడా ప్లేస్ లేదు ప్రశాంతతకి అని తెలిసి కార్ లోనే కూర్చుని కాసేపు కబుర్లాడుకుందాం అనుకున్నారో లేదో కానిస్టేబుల్ ఛలో సాబ్ అంటూ కార్ పై కొట్టాడు. అసలే అతి ఓపికమంతులైన మావారు వాడిని చూడక ముందే నేను నవ్వుతూ అలాగే వెళుతున్నాము అంటూ ఒక నవ్వు నవ్వాను. గేర్ మారుస్తున్న మావారి చేతిపై నేను చేయివేయగానే కూల్ అయిన మైండ్ ఆయనకి ప్యాకెట్ ని గుర్తుచేసింది.
ఓయ్.......ప్యాకెట్ ఇస్తూ కార్ లోనే తినెయ్ కరిగిపోతుంది అన్నారు. నేను ప్రేమగా చూస్తూ ఇంకా మరచిపోలేదన్న మాటా నా సరదాలు ఇష్టాలు అంటూ చాకోబార్ ని విప్పి తినబోతుంటే కరిగి చాకోలేట్ అంతా చీరపై పడ్డం, పెద్ద గుంత వచ్చి కార్ ఎగరి గెంతడం ఒకేసారి జరిగింది. సారీ సారీ అంటూ చీరపై పడిన చాక్లెట్ తో చీరపాడైపోతుందనే కంగారులో వాటర్ బాటిల్ లోని నీళ్ళతో కడుగుతూ పరిసరాలని మరచిన ఈయన్ని పబ్లిక్ గా  పెళ్ళాంతో కూడా సరసమాడకూడదన్న పవర్ పుల్ రూల్స్ తెలిసిన పోలీసు పొగరుగా మాట్లాడుతూ పెనాలిటీ వేసేసరికి...........
...........
...........
ఇంకేం చెప్పినా చప్పగా ఉంటుందని తెలిసిన తెలివైన పాఠకులు మీరు అందుకే.....అక్కడితో ఇద్దరం మూడ్ మారి మారు మాట్లాడకుండా ఇంటికొచ్చి "ఇంటిని మించిన స్వర్గం ఇలలో లేదని" ఇద్దరం వేరు వేరు ట్యూన్స్ లో పాడుకున్నాం :-)  అని చెప్పను రాసి పోస్ట్ చేయనుగాక చేయను!

Thursday, January 17, 2013

నా ఎవర్ గ్రీన్ హీరో

వయసులో ఉన్నప్పుడు వెలగబెడితే విడ్డూరం కానీ వయసొచ్చాకైతే ఇలాగే ఉంటుంది......ఇదేంటి రాక రాక వస్తూ ఇలా అని తిట్టుకోకండి!
మొన్నామధ్య మేము ఢిల్లీ వెళ్ళినప్పుడు మావారు వెలగబెట్టిన రాచకార్యం చెబితే మీరేమంటారో మరి....
AP ఎక్స్ ప్రెస్ ఎక్కిన రెండుగంటలకి కాజీపేట్ రాగానే మళ్ళీ రైలు ఇంక ఆగదు అన్నట్లుగా ఆత్రంగా దిగి దమ్ముకొట్టి అక్కడ ప్లాట్ ఫాం పై ఉన్న దుమ్మురేపుకుంటూ సిగ్నల్ ఇచ్చాక బండి ఎక్కి ఆయాసం తీర్చుకుంటుంటే చెప్పాను....ఇలా ఎందుకండి ప్రతి స్టేషన్ లో దిగి దమ్ము కొట్టడం అని, మౌనంగా ఒక నవ్వు నవ్వి ఢిల్లీలోని జంతర్ మంతర్ చూడ్డం అవసరమా అంటూ అనవసరమైన టాపిక్ లేవనెత్తేసరికి మా అమ్మాయి అయోమయంగా వాళ్ళ నాన్నని చూస్తూ దమ్ముకొడితే ఇలా వింతగా ప్రవర్తిస్తారు కామోసును, నేను పెద్దగైయ్యాక కొట్టి చూడాలి అన్న ఎక్స్ ప్రెషన్ ఇస్తూ వద్దులే అమ్మా అంటూ ఐపోడ్ ఆన్ చేసింది (ఎంతైనా అది వాళ్ళ నాన్న కూతురుకదండి)!
మధ్యాహ్నం భోజనం చేసాక నేనిచ్చిన డోసో లేక ట్రైన్ ఆగని కారణమో కాసేపు కునుకు తీసి ఎవరో కొట్టి లేపినట్లే నాగపూర్ స్టేషన్ లో బండి ఆగడం తోటే చెంగున ప్లాట్ ఫాం పైకి గెంతుతూ తూలి పడబోతూ నిభాళించుకున్నారు. బాడీ సిక్స్ ప్యాక్ ఉంటే సరిపోతుందా స్టామీనా తగ్గాక అంటే వినరని తెలిసి కిమ్మనకుండా ఇష్ష్.......అనుకున్నా! ఇదేం పట్టించుకోని మావారు దేవానంద్ హెర్ స్టైల్ ఇంకా తన తలపై ఉన్నదన్న తలంపుతో బాల్డ్ హెడ్ ని సరిచేసుకుంటూ టీస్టాల్ దగ్గరకి ట్రాన్స్ లో వెళ్ళి ఓ నాలుగు సిగరెట్లు రెండు టీలు తాగి అక్కడున్న హల్దీరాం యాడ్ ఫోటోలని చూస్తూ కోడిని చూసి కోటాశ్రీనివాస్ లొట్టలు వేసినట్లుగా వేస్తూ ట్రైన్ కి సిగ్నల్ ఇచ్చిన విషయం మరచి చివరి బోగీ ప్లాట్ ఫాం వీడుతుంటే పరుగెట్టి పరుగెట్టీ పట్టుకోలేక పడబోతుంటే పాంట్రీ కార్ వాళ్ళు పైకి లాగి నీళ్ళిచ్చి నాలుగు చివాట్లు పెట్టి ఉంటారులెండి ( మేల్ ఇగో తో ఇవి చెప్పరు కదా:-)
అక్కడలా.....ఇక్కడ అరగంటైనా ఈయన రాకపోయేసరికి కంగారు ట్రైన్ ఎక్కారో లేదో అక్కడే ఉండిపోయారో అని, మొబైల్ రింగ్ అవుతుంది కాని రిప్లై లేదు. తోటిప్రయాణీకులొకరు చైన్ లాగమంటే ఇంకొకరు కంగారెందుకు ఎక్కుంటారని అంటున్నా కంగారు పడుతున్న మనసు నా కూతురి కళ్ళనిండా నీళ్ళని చూసేసరికి కలవరపడి చైన్ లాగబోతుంటే ......గుండెని జేబులోనుండి జారిపోకుండా పట్టుకున్నట్లుగా బేలముఖానికి కవరింగిచ్చుకుంటూ "సారీ రా పండూ" అంటే ఏమనగలను ఐస్ అయిపోయాను!
టైన్ లో ప్రొగతాగితే జరిమానా అనేది ఎవరికెంత వర్తించిందో తెలీదుకానీ పరుగెడుతూ ట్రైన్ ఎక్కబోతూ బ్లాక్ బెరీ సెల్ ని మాత్రం జారవిడుచుగోవలసి వచ్చింది.