Tuesday, August 28, 2012

కల నిజమాయె!

మత్తెక్కిస్తున్న మైసూర్ సాండల్ సోప్ వాసనతో అందమైన అంజంతా శిల్పంలాంటి ఆమె పట్టులాంటి పొడవైనకురులు అలా మొహం మీద పడగానే సాంబ్రాణి గుభాళింపులు నాసికానికి తాకి లేచేలోపే కోయిలవంటి స్వరంతో....ఏవండీ! కాఫీ తీసుకోండని ఆమె అంటూంటే, చేతినిండా వేసుకున్న గాజులు మేమేం తక్కువా అంటూ గలగలమంటూ గిలిగింతలు పెడుతుంటే లేచి వేడి వేడి కాఫీ తాగుతూ.... ఆలుచిప్పల్లాంటి కళ్ళతో, నుదుటిపై ఎర్రనిసింధూరంతో, చిన్నిసన్నని పెదవులు పలికి కదిలితే కవ్విస్తాయేమో అని బిత్తర చూపులు చూస్తుంటే, లేతనిమ్మ పండురంగు షిఫాన్ చీర ఆమె తనువుతో పోటీ పడుతుంటే, తనివితీరలేదంటూ తనవైపు లాక్కునేలోపు,,,,,,!!!
ఏవండీ! ఎనిమిదికావొస్తుంది లేచి బ్రష్ చేసుకుని పొయ్యి మీద పెట్టిన కాఫీని వేడిచేసుకుని తాగి తయారై వెళుతూ క్యారేజ్ తీసుకుని వెళ్ళడం మరచిపోకండి. అలాగే పనమ్మాయి వస్తే తనకి కూడా కాఫీ ఇవ్వండి, తలుపు వేసుకోండి అంటూ.....హడావిడిగా చెప్పేస్తూ సల్వార్ సూట్ వేసుకుని చున్నీ కోసం వెతుకుతున్న నన్ను, నా చిన్ని జడను, చేతికున్న వాచ్ & బ్రేస్ లెట్ ని, నుదుటి పైనున్న గుండుసూది మొనంత బొట్టును లేచి కళ్ళజోడు పెట్టుకుని కలలోని లేని అందాలని నాలో వెతుకుతుంటే నాకేం అనిపించదేమో కానీ మా శ్రీవారికి ఏమనిపించి ఉంటుందో మీరంతా ఊహించే ఉంటారనుకోండి. మళ్ళీ నేను చెప్పి మిమ్మల్ని బోర్ కొట్టించడం ఎందుకని ఇలా ఆపేస్తున్నా:-)
హావ్ ఎ నైస్ డే !!!