Thursday, January 21, 2010

మై డార్లింగ్ డ్రాకులా!

ఓసారి నాలుగురోజులు సెలవు తీసుకుని మావారి ఊరెళ్ళానండి....అదేంటని ఆశ్చర్యపోరని నాకు తెలుసులెండి, ఎందుకంటే నేనిక్కడ(వరంగల్) ఆయనక్కడ(విజయవాడ) అని మీకు తెలుసుననే విషయం నాకు తెలుసుగా....
ఇంక అసలు విషయానికి వస్తే....ఆరోజు శనివారం రాత్రి మేమిద్దరం సెకండ్ షో సినిమాకి వెళ్ళాం, మర్నాడు కాస్త ఆలస్యంగా లేచినా పర్వాలేదు అనుకుని హోటల్ లో టిఫిన్ చేసి థియేటర్ వద్దకు చేరుకునే సరికి ఏ తెలుగు సినిమాకి టిక్కెట్లు దొరకలేదు... ఎలా దొరుకుతాయి చెప్పండి అప్పటికి సమయం పది కావొస్తుంది. అయ్యో! నీకు సినిమా చూపించ లేకపోయానే అని బాధపడుతూ వాళ్ళ రూమేట్స్ తో చూసిన సినిమాల గురించి వివరిస్తుంటే తెలిసిందేవిటంటే ప్రక్కన థియేటర్లో "డ్రాకులా" సినిమా ఆడుతుందని అది ఆయనకి చూడాలనివుందని.
సరేలే సినిమాకి భాషావిభేధాలేల అనుకుని ఆ సినిమా హాల్లోకి చేరుకునే సరికి మాలాంటి భాధితులతో హాలు అక్కడక్కడా నిండివుంది. అప్పట్లో నాలాంటి ఆంగ్లభాష అర్థంకాని వారికోసం చిత్రం చూపించడానికి ముందు తెలుగులో చిత్రకధని క్లుప్తంగా చెప్పేవారు. ఆలస్యంగా అడుగిడడం వలన గుండెధైర్యం లేనివారు జాగ్రత్త అన్న ఆఖరి పలుకులు తప్ప మిగిలిన కధని వినలేకపోయాను. ఆ ఏముందిలే మనకున్న సినీ పరిజ్ఞానంతో ఆపాటి కధని అర్థం చేసుకోలేమా అనుకుని శ్రద్ధగా ప్రతి డ్రాకులా డైలాగులు వినసాగాను.తెరపై డ్రాకులా హీరోయిన్ని కొరకడం ఆవిడకి రెండు కోరలు రావడం దాన్ని క్లోజప్ లో చూపిస్తూ ఇంటర్వెల్ వేసిందే తడువు అందరూ లేచి బయటికి వెళ్ళడం ఒకదాని వెంట ఒకటి జరిగిపోయాయి.ఈయనగారు నాకు కూల్ డ్రింక్ తీసురావడానికి బయటికి వెళ్ళి(అది కాదు అనేవిషయం మీకు తెలిసినా అలా అనుకోవడం నా తృప్తి)ఎప్పుడు తిరిగి వచ్చి నా ప్రక్కన కుర్చున్నారో తెలియదు కాని ఆంగ్లభాషే సరిగ్గా అర్థం కాని నేను ఆంగ్లడ్రాకులాలని అర్థం చేసుకోవడంలో లీనమైపోయాను.అప్పుడప్పుడూ ఉలిక్కిపడి చెవులు మూసుకుని అరిచాను అనేవిషయం నాకు తరువాత తెలిసిందిలెండి.
మొత్తానికి చిత్రం చివరిలో రాత్రి అయితే అందరూ డ్రాకులాలుగా మారిపోతారు అనిమాత్రం నా తెలివైన బుర్రకి అర్థమైంది తెరపై చిత్రం అర్థరాత్రి అంతమైంది.పదండి అని ప్రక్కన వున్న ఈయనగారి చేయి పట్టుకుని(ధైర్యం కోసం) లేచిన నాకు ఎదురుగా సారీ రా.. పద వెళదాం అంటూ మావారి ప్రతిరూపం ఆయన వెనుక చేతికికట్టుతో ఎవరిదో తెలిసిన ముఖం. డ్రాకులాలపై పూర్తిగా ప్రేమలో మునిగిన నన్ను వాళ్ళ సామ్రాజ్యంలో కలుపుకోవడానికి ఈయన రూపంలో వచ్చారేమోనని చెప్పడానికి అటుతిరిన నేను అప్రయత్నంగా మీరా అని నోరువెళ్ళపెట్టి చేతులు విధిలించి కుర్చీలో చతికిల పడ్డాను.
విషయం ఏమిటంటే ఇంటర్వెల్ లో బయటికి వెళ్ళి నాలుగు దమ్ములు కొట్టి టాయిలెట్లోకి వెళ్ళిన ఈయనకి అక్కడ వాళ్ళ ఫ్రెండ్ చేయి టాయిలెట్ తలుపు మద్యలో పడి దెబ్బతగిలిందని తెలిసి అతన్ని తీసుకుని దగ్గర్లోని హాస్పిటల్లో కట్టు కట్టించి తీసుకుని వచ్చారు. హాస్పిటల్ కి తీసుకుని వెళుతూ థియేటర్లో మా మావయ్య కనిపిస్తే నేను లోపల ఉన్నానని కంగారు పడతానని నాకు ఈవిషయం చెప్పొదని గంటలో వస్తానని చెప్పి వెళ్ళారు. నేను సినిమా చూస్తూ నా ప్రక్కన కూర్చుని నన్ను పలకరించి కూల్ ఢ్రింక్ అందించిన మావయ్యని గమనించలేదు. మావయ్య కూడా సరేలే సినిమా అయ్యాక మాట్లాడవచ్చని సినిమా చుస్తూ మధ్య మధ్యలో నా విన్యాసాలని కూడా తిలకించారన్నమాట.మొన్న పండకి మావయ్య వాళ్ళు ఇంటికి వచ్చినప్పుడు ఈ విషయం గురించి చెప్పుకుని నవ్వుకున్నది మీతో ఇలా పంచుకుంటున్నానండి.

Wednesday, January 13, 2010

బాత్ రూం లో భోగి...

అవి సంక్రాంతి సంబరాల రోజులు....నేను చెల్లెలు కలసి ముగ్గులు వేస్తూ వాటికి రంగులు నింపి అలా కాలనీలో ముగ్గులు చూస్తూ స్నేహితులతో కబుర్లలో నిమగ్నమై ఉండగా అల్లుడుగారు అత్తగారింటికి అడుగిడినారు....ఎవరా అని ఆశ్చర్యపోతున్నారా! అదేనండి మావారే, మొదటి సంవత్సరం క్యాంటీన్ కాఫీతో కడుపు ఖలాస్ అయింది కదా ఈసారైనా అల్లుడిగారికి ఆతిథ్యంతో అదరగొట్టేయాలనుకున్న అత్తగారి ఆహ్వానాన్ని ఆనందంగా అంగీకరించి భోగి నాడు అరుదెంచిన మా శ్రీవారి అహ్లాదకరమైన అనుభవమన్నమాట.....

అడుగిడిన అల్లుడిగారు అత్తగారి పలకరింపుల అనంతరం స్నానానికి వెళుతూ, నేను కనపడలేదన్న కలవరమో, ముంగిట నేను వేసిన ముగ్గులని చూసిన పరవశమో లేక ఎవరిని అడగాలి అన్న మొహమాటమో కాని అక్కడ తాడుపై వేసిఉన్న టవల్ ని కట్టుకుని బాత్రూంలోకి దూరిన గంటకి కూడా బయటికి రాలేదు.......ఇక్కడ బయట అమ్మ ఇంతసేపు అల్లుడుగారు లోపల ఏం చేస్తున్నారో అనుకుంటూ ఇంకా ఇంటికి రాకుండా ఏం పెత్తనాలు వెలగబెడుతున్నారో వీళ్ళు అని మనసులో మమ్మల్ని తిట్టుకుంటున్న అరగంటకి అరుదెంచిన మాకు అమ్మ చెప్పిన విషయానికి ఆత్రుతగా పెరట్లోకి వెళ్ళి తలుపు కొట్టిన నాకు టవల్ కాస్త నా మొహాన్న పడేయమన్న ఈయనగారి విసుగుతో కూడిన స్వరం విని టవల్ అందించాక నాకు అసలు విషయం కొంచం అర్థమైంది మిగిలినది మావారు వినిపించారు.

అత్తారింటికి వస్తున్న ఆనందంలో కాదులెండి నన్ను చూడాలన్న ఆత్రుతలో అదీ కాదు మరదళ్ళతో ముచ్చటించాలన్న మురిపంలో తాళాలని, పర్స్ ని ఓ జేబుదొంగకి సమర్పించి తాళం వేసిన సూట్ కేస్ తో వచ్చారు. ఇక్కడ నేను కనపడపోయేసరికి మొహమాటానికి పోయి పెరట్లో తాడుపై వున్న టవల్ ని తీసుకుని బాత్రూంలోకి దూరి టవల్ విప్పి తలుపుపైన వేసారు లోపల ఈయన ఉన్నవిషయం తెలియని పనిమనిషి అది ఉతకవలసిన టవల్ అని తీసుకుని వెళ్ళి నానపెట్టేసింది. స్నానం చేసి బయటికి రావాలంటే టవల్ లేదు, అప్పటికీ రెండుసార్లు ఈయనగారు అరచినది అత్తగారికి పని హడావిడిలో వినపడలేదు, అమ్మ అల్లుడిగారిని అడిగితే బాగుండదని అడగలేదు.....దాని పర్యవసానం మావారు బాత్ రూం లో గంటన్నర ఒంటికాలిపైన జపం అన్నమాట....

తరువాత........ ఏముంటుందండి సూట్ కేస్ తాళాలని బ్రద్దలకొట్టి డ్రెస్ వేసుకునే వరకు టవల్ కట్టుకుని టాలీవుడ్ సల్మాన్ ఖాన్ లెవల్ లో మరదళ్ళకి ఫోజ్ ఇచ్చారన్నమాట....