Friday, July 10, 2009

ప్రియమైన శ్రీవారికి....

అప్పట్లో "శ్రీవారికి ప్రేమలేఖ" చిత్రం చూసాక నాకు ఒక చిత్రమైన కోరిక కలిగిందండి....
ఎవరికైనా అలా నేను కూడా ఒక లేఖ వ్రాయాలని దానికి స్పందన అందమైన జవాబు రూపంలో నా ముందుండాలని....
కోరికైతే బాగానే ఉంది కాని దానికి సరి అయిన వ్యక్తి తారసపడలేదు, వెదికి పట్టుకునే తీరిక ధైర్యము మనకి అంతకన్నా లేవు....అలా ఆ కోరిక తీరకుండానే పెళ్ళైపోయింది.
వరంగల్లో ఉద్యోగం వెలగబెడుతున్న రోజుల్లో...సంధ్యారాగం చంద్రహారతి పడుతున్న వేళ, మసక చీకటి మధ్యమావతి పాడుతున్న వేళ ఆ శుభముహుర్తంలో మళ్ళీ నాలో ఆ పాత కోరిక చిగురించింది...చిగురించిందే తడవు మనకి కొదవేమిటి చెప్పండి! తీసాను ఒక అందమైన గులాబి పువ్వున్న లెటర్ పాడ్ రాసాను పుంఖాను పుంఖలుగా నాలోని భావాలకి అక్షర రూపాలనద్ది......తొలిసారి ఆయన్ని చూసింది మొదలు, ప్రేమించి బుట్టలో పడ్డానని కాస్త...కాస్త ఏమిటి పావలాకి రూపాయి అంత యాక్షన్ లెవెల్ లో రాసిపడేసాను, కాదు కాదు పొస్ట్ చేసేసాను!
తరువాత ఆఫీసు పని ఒత్తిడిలో ఆ లేఖ విషయం మరచిపోయాను.వారం రోజుల తరువాత సాయంత్రము ఇంటికి వచ్చి ఇంటి తాళం తీసి లోపలికి అడుగు పెట్టగానే పాదాల దగ్గర లేతాకుపచ్చని రంగున్న కవరు కంటపడింది.అప్పుడు గుర్తొచ్చింది నేను వ్రాసిన ఉత్తరానికి అది ప్రత్యుత్తరమని....ఆత్రుతతో విప్పి చూసాను ఏమి వ్రాసివుంటారా అని!!!

అవే గులాబి పువ్వున్న కాగితాలు, అదే నా చేతితో వ్రాసిన పుంఖాను పుంఖల కాగితాలు.ఏమిటి టపా తిరిగి వచ్చింది అని చూసుకుంటే!! పచ్చని కవరుపై అడ్రసు నాదే వ్రాసి వుంది.కాగితాలని పరీక్షగా చుస్తే కనిపించాయి ఎర్రని సిరాతో వేరొకరి చేతిరాతలు నా వ్రాతలపైన........ ఎవరైన బడిపంతులుగారికి పోస్ట్ చేసానా ఏవిటి కొంపతీసి అనుకుని చివరి పేజీలో క్రింద చూస్తే వ్రాసి వుంది ఎర్రని సిరాతో "ప్రియమైన భార్యామణి ఇంత అందంగా ముత్యాలని మూటగట్టి నీవు వ్రాసిన ఉత్తరము చదవక మునుపే నిన్ను ప్రేమించాను కాని తమరు కాస్త అక్షర, వ్యాకరణ దోషాలని సరిచూసుకోండి" అని......ఇంకా ఏమి వ్రాసివుంటారబ్బా, అని ఆలోచిస్తున్నారా!!!ఛా...ఛా అలా ఎందుకు ఆలోచిస్తారు చెప్పండి మీరు!!

10 comments:

 1. మరి మళ్లీ రాసేందుకు ఎప్పుడైనా ప్రయత్నించారా?

  ReplyDelete
 2. హ హ ...బాగుందండీ మీ లేఖాయణం...

  ReplyDelete
 3. సృజన గారు మీ బ్లాగ్ లో పోస్టులు ఒక్కటి కూడా వదలకుండా మొత్తం చదివేసా అండి...ఎంత చక్కగా రాస్తే, అసలే భద్దకస్తుల కేర్ అఫ్ అడ్రెస్స్ లా ఉండే నేను మీ బ్లాగ్ మొత్తం చదివేస్తా చెప్పండి....యు అరె సింప్లీ అమేజింగ్....మీ పోస్టుల కోసం వెయిటింగ్ ఇక్కడ ..

  ReplyDelete
 4. evandyoo ela rasarao maku kuda cheppandii..chala baga rasaru andii
  untanu andi
  na blog ki vichhesinaduku chala kruthagnatahalu andi

  ReplyDelete
 5. ఐతే మీరు తరువాత వ్రాసిన లేఖలో ఖాళీలను పూరించండి అని వ్రాసి ఉంటారు ఆవునా!!!

  ReplyDelete
 6. :-)) బాగుందండి. లేఖాయణం...

  ReplyDelete
 7. తెలియకుండానే నవ్వొచ్చేసిందండి టపా పూర్తి చేసేసరికి...

  ReplyDelete
 8. హ హ సృజన గారు చాలా బాగా రాస్తున్నారు.. అభినందనలు :)

  ReplyDelete