Saturday, July 28, 2012

ఫ్రాన్స్ పకోడా ఫ్రెండ్స్

మావారికి ఉన్న ఒక మంచి అలవాటు ఏ హోటల్ కి వెళ్ళినా ఒక ప్లేట్ ఇడ్లీ చెప్పడమైతే నాకున్న చెడ్డ అలవాటు నేను ఆర్డర్ చేసిన తరువాత ఎదుటివారి ప్లేట్ వంకచూసి అయ్యో అది ఆర్దర్ చేసివుంటే బాగుండేది కదా అని అనుకోవడం, ఇది టిఫిన్ ల వరకే పరిమితమైతే బాగుండేది కాని అలా జరిగితే స్మృతిపధంలో చేరదు కదండి. తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్లు నా ఈ అలవాటు టిఫిన్ నుండి చైనీస్ రెస్టారెంట్ వరకు పాకి మావారికి  ఒక పొగ ఫ్రెండ్ ని ,నాకు మావారిని వద్దని వారిస్తూ అలిగి చివాట్లు (నేను డామినేట్ చేస్తున్నానని చెప్పే తాపత్రయం అని మీకు తెలుసుననుకోండి)  పెట్టే అవకాశాన్ని ప్రసాదించిందని చెప్పాలి.
ఎలగెలగా???అని మీరు అడిగినా అడగకపోయినా చెప్పేస్తాను కదా....
ఇంకతప్పదుకదా చదివేయండి!
ఒకానొకనాడు ఒక చైనీస్ రెస్టారెంట్ కి వెళ్ళి కూర్చున్న నాతో మావారు...ఇదిగో  ఆర్డర్ ఇవ్వక ముందే అలా ఒకసారి నీ కళ్ళతో నాలుగువైపులా ఒక లుక్ వేసుకోమని తరువాత అయ్యో అది తింటే బాగుండేది ఇదికాకుండా  అని నాతో బలవంతంగా నానాగడ్డి తినిపించమాకంటూ ఉచిత సలహా విసిరారు.....ఇదేదో బాగుందని అక్కడే కూర్చుని చూస్తే బాగుండేది కాని కాస్త అడ్వాన్స్ అయ్యి నేను అలవోకగా చూసీ చూడనట్లు ఓ నాలుగైదు టేబుల్స్ పై ఉన్న మెనుని కళ్ళతోనే భుజించి ఒక మూల టేబుల్ పై ఉన్న డిష్ నుండి చూపుని మరల్చుకోలేక.... ఏవండి అది కావాలంటూ నేను సైగ చేస్తే మావారు డిష్ ని చూడమంటే అది తింటున్న ఆవిడని చూడ్డంతో కధ అడ్డం తిరిగింది.
అదెలా అంటారా!
ఆ డిష్ పేరేంటో అడిగి ఆర్డర్ చేద్దామని వెయిటర్ ని పిలుస్తుంటే వినిపించుకుని ఇదిగో వస్తున్నా అని రాడు....మావారు ఆవిడవైపు ఆ డిష్ వైపు చూస్తూ యమ కంగారు పడిపోతుంటే ఎవరైతే చూడకూడదో వాళ్ళే చూసి  చెప్పాల్సిన వాళ్ళకే చెప్పారు, ఇంకేముంది వాళ్ళాయన వచ్చి మా టేబుల్ దగ్గరకి సీరియస్ గా నాలుగు మాటలు మాట్లాడేసరికి మావారికి మాటర్ మళ్ళిందని అర్థమై చెప్పడానికి తడబడుతూ (తప్పేకదండీ అలా చూడ్డం) అయినా తప్పదని మొత్తం చెప్పేసారు....
ఇంతకీ ఆ డిష్ పేరు ఫ్రాన్స్ పకోడా చూడ్డాని లడ్డూల్లా ఉండేసరికి, అందులోనూ అది మొదటిసారి అలా చూడ్డం వల్లనో మాకిద్దరికీ తెలియక ఈయన పాపం వెయిటర్ ని పిలిచి వాడు రాక వేసారి ఆవిడ ప్లేట్లోనివి అన్నీ తినేస్తుంటే ఎలా చెప్పాలో అన్న కంగారులో ఆవిడనే చూస్తూ ఆవిడ అపార్ధం చేసుకుని వాళ్ళాయనతో మావారికి ఓ హాట్ డిష్ తినిపించిందన్నమాట....మావారికి నాపై కాస్త ప్రేమ పాళ్ళు ఎక్కువేమో నేను అడిగింది తినిపించాలన్న తపనలో ఇలా చేసారనే విషయం నాకర్ధమైనట్లు అందరికీ అర్థమౌతుందా చెప్పండి!
మేము తినడం ముగించుకుని బయటకి వచ్చాక నన్ను స్కూటర్ దగ్గర ఉండు ఇప్పుడే వస్తాను అని వెళ్ళిన ఈయనగారితో పాపం ఆయనగారు కూసింత వాళ్ళవిడపై అధిక ప్రేమని మావారిపై వేడిగానే విసిరారేమో తరువాత తీరిగ్గా బయట సిగరెట్టు మీద సిగరెట్టు కాలుస్తూ ఈయనకి సారీలు బోలెడన్ని చెపుతూ అలా కాలక్రమేణా వారిద్దరూ మాంచి పొగత్రాగే ఫ్రెండ్స్ గా (వాళ్ళ అపార్ట్ మెంట్స్ దగ్గరే మేము ఇల్లు కొన్నుక్కోవడం యాధృచికమే అయినా)  ప్రఖ్యాతి చెందారు.

8 comments:

 1. ఓహో ....సండే స్పెషల్ స్మృతన్నమాట:-) Yummy yummy

  ReplyDelete
 2. సృజనగారు మీ స్మృతులన్నీ భలే సరదాగా ఉంటాయండి:)

  ReplyDelete
 3. రాస్తూ ఉండండి...హాయిగా నవ్వుకుంటాం:)

  ReplyDelete
 4. మరి మాకెప్పుడు ఆర్డర్ చేస్తారు...:)

  ReplyDelete
 5. మీవారి ప్రేమ మీకన్నా అర్థమైనందుకు అభినందనలు,
  అర్జెంటుగా పొగ తగ్గించమని చెప్పండి.

  ReplyDelete
 6. chaalaa baagaa raasaaru, mee prema kalakaalam ilaage undaalani korukuntoo mimmu mee vaarini deevistunnaanu.

  ReplyDelete
 7. ఇది నిజమండి. మన ప్లేట్ల్ లో ఉన్న ఐటమ్స్ కంటే పక్కనోడు ఆర్డర్ ఇచ్చిన ఐటమ్స్ నోరూరిస్తాయి.

  ReplyDelete
 8. This comment has been removed by the author.

  ReplyDelete