Wednesday, August 12, 2009

భర్త, భార్య అండ్ బైక్....

మేఘాలలో తేలిపొమ్మన్నది... తూఫానులా సాగి పొమ్మన్నది అమ్మాయితో......
నాతో పెళ్ళైయ్యాక ఇంక ఏ అమ్మాయితో సాగిపోయే అవకాశం లేక మావారు నాతోనే ఇలా సాగిపోవాలనుకున్నారు...అదేనండి లాంగ్ డ్రైవ్ విత్ గర్ల్ ఫ్రెండ్ కాదు కాదు విత్ వైఫ్....ఆయన కోరిక అందులో నాకు మహాసంబరం అలా బైక్ పై వెళ్ళాలని, కాని అప్పట్లో మాకు బైక్ లేదు అందుకే ఆయన వాళ్ళ ఫ్రెండ్ బైక్ తీసుకుని వస్తే దానిపై అన్నవరం అక్కడనుండి వైజాక్ బీచ్ (పుణ్యం, పురుషార్ధం రెండు కలసివస్తాయని) ప్లాన్ వేసారు.......
ఉదయం 5గం' లకి రాజమండ్రి నుండి బైక్
టాంక్ ఫుల్ చేయించుకుని బయలుదేరితే గంట ప్రయాణానికే అలసిన బైక్ కాస్త విశ్రాంతి కోరింది. ఏదో పాపం అది మాఇద్దరిని కాసేపు మాట్లాడుకో మని అవకాశం ఇచ్చింది కాబోసు ఎంతైనా రొమాంటిక్ బైక్ అనుకుని పావుగంటాగి బయలుదేరాము. దారిలో గొర్రెలమందని చూసి దానికి మరి ఏం గుర్తుకువచ్చిందో మరో పదినిముషాలు ఆగింది. రోడ్డుకి ఇరువైపులా పచ్చని చెట్లు మావారు పాటందుకుందామని మనసులో అనుకున్నారో లేదో డుబ్...డుబ్... మంటూ చక్కని సైలన్సర్ సౌండ్ తో బైక్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇస్తూ ఆగింది. అదేవిటండి మీరు ఇంకా పాట అందుకోనేలేదు నేను దానికి స్వరము కలపక ముందే ఆగిపోయింది ఏవిటండీ అంటే!! ఏమో! పచ్చదనాన్ని చూసి బైక్ టాంక్ వేడెక్కినట్టుంది కాసేపాగి వెళదామంటూ మంచినీళ్ళ సీసాని ఎత్తింది దించకుండా గడగడా తాగారు. కాస్త దూరం వెళ్ళాక ఊళ్ళోకి వెళితే టీకొట్టు ప్రక్కన వేడి వేడి అట్లు వేస్తూ అవ్వ ఆహ్వానిస్తే ఆకలికి ఆగలేక మావారు అరడజను అట్లు ఆరగించి బైక్ ని ముందుకి పొమ్మంటే మీరు తిన్న అట్లబరువుని మోయడం నావల్లకాదంటూ మొరాయించింది....అదికాదులెండి! చెట్టుక్రింద వున్న తుమ్మముల్లుని ముద్దాడి పంచరైంది.....అదేనండి చిల్లుపడి గాలిపోయింది. పంచరు వేసి గాలి కొట్టించి బైక్ ని బుజ్జగించి బయలుదేరేసరికి సమయం పదిగంటలు. అంతా సవ్యంగా జరిగివుంటే అప్పటికి అన్నవరంలో వుండేవాళ్ళం. బైక్ ని కాస్త మెల్లగానే నడపండి ఎందుకంటే మళ్ళీ అలుగుతుందేమో అని ఈయనతో మెల్లగా అని బైక్ కి పాత పాటలు ఇష్టమేమోనని "తలచినదే జరిగినదా దైవం ఎందులకు" అని గొంతు ఎత్తాను అంతే ఛా వీళ్ళకి అస్సలు మ్యూజిక్ సెన్స్ లేదంటూ మూలుగుతూ బైక్ ఆగిపోయింది........ఏమని చెప్పను! పెట్రోల్ అయిపోయిందండి! బైక్ ని తోసుకుంటూ దాని ఆకలి తీర్చేసరికి నాకు నీరసం ఆయనకి ఆయాసం ఒకరిపై ఒకరికి కాస్త విసుగుతో కూడిన చిరాకు. ఎలాగైతేనేం అన్నవరం చేరుకునేసరికి ఒంటిగంట ఇక్కడ మాకు కడుపులో మంట......ఎదురుగా గుడి తలుపులు మూసుకున్నాయి, అవి మూడు గంటలకి తెరుచుకుంటాయంట!
దేవుడి దర్శనం అయినతరువాత ఇంక వైజాక్ బీచ్ లో బైక్ విన్యాసాలు ఏమి చూస్తాములెండి అంటూ తిరుగు ప్రయాణం అయ్యాము. ఓహో! భలే భలే ఇంటికి త్వరగానే వెళుతున్నాము అని హుషారుగా బయలుదేరిన బైక్ గంట పయనించి చిన్ని గుంతలో కూలబడింది ఏవిటని నన్ను అడగకు అంటూ ఈయన నాలుగడుగులు వేసి బైక్ ని నలుగురి సహాయముతో లారీలో వెనుక దాన్ని ఎక్కించి ముందు మేము కూర్చుని ఇంటికి చేరేసరికి రాత్రి పదిగంటలు......
(బైక్ అంతకు ముందు నెలరోజులనుండి మెకానిక్ దగ్గరే వుందట! స్నేహితుడు అడగక అడగక అడిగాడు కదా అని ఆయనగారి మంచి మిత్రుడు బైక్ ని మెకానిక్ దగ్గర నుండి ప్రయాణానికి ముందు రోజు హడావిడిగా రిపేర్ చేయించి ఇచ్చారంట! అది ఒక లీటర్ పెట్రోల్ ఒక కిలో మీటర్ ప్రాతిపధిక మీదనే పని చేసేదట! ఇంకా మామీద అభిమానంతో అలా సర్దుకుని పోయిందట! అదీసంగతి..)





11 comments:

  1. lollll :)

    Please remove 'Word Verification' in Comments Setting

    ReplyDelete
  2. హహహ పాపం మీ బైకు ప్రయాణం అలా అడ్డంకులతో సాగిపోయింది. కాని మీ టపా చదువుతుంటే నవ్వు ఆపుకోలేక పోయానంటే నమ్మండి.

    ReplyDelete
  3. yi bike gata janma lo mi vaari girl friend,valliddaru appatlo annavaram vellinappudu sankarabharanam lo rajyalakshmi la meeru kanipiste mimmalni pelli chesukunnaru , aa kakshato yi janma lo bike ga putti kasi teerchukundi. yide story ni magadheera part2 ga twaralo allu aravind nirmincha botunnarani abhijna vargala bogatta .

    ReplyDelete
  4. మేఘాలలో తేలిపొమ్మన్నది... తూఫానులా సాగి పొమ్మన్నది అమ్మాయితో...ఈ పాటనే మా ఆయనతో బైక్ మీద వెళుతున్నపుడు మొదటిసారిగా పాడాను నేను :)

    ReplyDelete
  5. భలే రాస్తారండీ మీరు.. బాగుంది బైక్ ప్రయాణం...

    ReplyDelete
  6. :). ఆ బైకుతో మీ తిప్పలేమో గాని మీరు చెప్పినవిధానం బాగుంది. అసలు జీవితంలో ఇలాంటివి జరిగితేనే మజా. మీరు ఏ ఇబ్బందీ లేకుండా వెళ్లి వచ్చుంటే అసలు వెళ్లిన సంగతి కూడా గుర్తుండకపోను!.

    ReplyDelete
  7. బైక్ ఇచ్చిన కిక్ గురించి భలే చెప్పారు, మరీ బ్యాక్ పెయిన్ సంగతో!!

    ReplyDelete
  8. భలే బావుందండీ..మీ బైకు ప్రహసనం :)

    ReplyDelete
  9. అరువు బైకు ఎన్ని తిప్పలు పెట్టింది :(

    ReplyDelete
  10. బాగుందండి..బైకు ప్రయాణం...

    ReplyDelete