Tuesday, June 16, 2009

శ్రీవారితో సినిమాకి!

అది పెళ్ళైన వారం రోజులనాటి సవ్వడండి........
ఏదో మావారికి కూడా అందరిలాగే వాళ్ళవిడతో సినిమాకి వెళ్ళాలని తెగ ముచ్చటపడి "చూపులు కలసిన శుభవేళ" సినిమా టిక్కెట్లు రెండు సంపాదించి నన్ను త్వరగా రెడీ అవ్వమని హాల్లో టీ.వి చూస్తూ కూర్చున్నారు. నేను తెగ సంబర పడిపోయి అత్తయ్యగారు అథితుల మధ్యలో ఉండగా ఈ కబురు చెప్పాను. ఆవిడ సరే అన్నారు కాని తొమ్మిదో తరగతి చదువుతున్న మా చిన్ని ఆడపడచు నేను కూడా రానా వదినా అంది, నాకు రెండు టిక్కెట్లు మాత్రమే వున్నాయనే విషయము తెలియక సరే రమ్మన్నాను. ఇది విన్న మా పెద్దాడపడచు పిల్లలు మేము మరీ అంటూ బయలుదేరారు. నా ఇద్దరు మరుదులు బేల ముఖంతో నిలబడితే నేనే వాళ్ళని కూడా రమ్మన్నాను. మేమేం పాపం చేసామంటూ మావారి మేనత్త పిల్లలు కూడా బయలుదేరారు.....పదండి! అంటూ అడుగిడిన నన్ను చూసి మురిసి పోయారో లేక నా వెనుక వున్న దండుని చూసి మూర్చపోయారో!....చూసేలోగా మావయ్యా పదా... అంటూ ఐదేళ్ళ మేనల్లుడు చేయిలాగేసరికి చేసేదిలేక పదండి అని కదిలారు.
తరువాత కధ మీకు తెలిసిందే..... ఆ సినిమాకి టిక్కెట్లు ఇంత మందికి ఇవ్వలేమంటూ ప్రక్క థియేటర్ లోని సినిమా కలక్షలని కాస్త పెంచమంటే ఆ పుణ్యకార్యం కూడా చేద్దాం పదా అనుకుని అందులో కూర్చున్నాము....సినిమా అప్పటికే మొదలై పావుగంట... మాలాగే టిక్కెట్లు దొరకని దురదృష్టవంతులతో హాలు నిండింది. నీతో సరదాగా సినిమా చూడాలి అనుకుంటే పిల్ల కోడిలా వీళ్ళందరినీ వెంటబెట్టుకుని బయలుదేరావా! అని అన్న మాటలకి సమాధానము చెప్పేలోపు.........అన్నయ్యా! చూడు నా ప్రక్క సీటు వాడి వెకిలి వేషాలు అంటూ ఫిర్యాదు. వెంటనే ఈయనగారు వెళ్ళి ఆ చివర కూర్చుంటే ఎనిమిది మంది ఎడమలతో ఈ చివర నేను. పిల్లలందరూ సినిమా చూస్తుంటే..... ఏడవలేక నవ్వుతూ ఈయన నన్ను చూస్తున్నారు.....నా ప్రక్కన కూర్చున్న చిన్నోడికి డౌట్లు చెప్పి ఈయన వైపు సినిమావైపు ముచ్చటగా మూడుసార్లు చూసేసరికి........తెరపై విశ్రాంతి.
అందరికి అల్పాహారాలందించి ఏదో గుర్తుకు వచ్చినట్టుంది నాకిష్టమైన మసాల బఠాణీల ప్యాకెట్టుని నాకివ్వమని ఆయన ప్రక్కనున్న చెల్లెలి చేతిలో పెట్టడము.....పిల్లలు అక్కడ తెరపై హీరో విలన్లని కుమ్ముతుంటే ఈ ప్యాకెట్టు చేతులు మారి నా చేతిలోకి వచ్చే సరికి వెల రు.15 అనే నూనె కాగితము, తెరపై గ్రూప్ ఫోటోతో సినిమా అంతము.
కొసమెరుపు: ఉదయం టిఫిన్ తింటూ పిల్లలందరూ వదిన మంచిదని, అత్తయ్య నాకు కావాలని,నా ప్రక్కన కూర్చోవాలంటే... నా ప్రక్కన అంటూ వాదించుకుంటుంటే, మా అత్తగారు అమ్మాయి ఎంతో కలివిడిగా కలిసిపొయింది రా అని ఈయనతో అంటుంటే విని ఈసారి మనమందరం కలసి వెళదామండి అత్తయ్యగారూ! అన్న మాటలకి పొలమారిందో లేక ఇడ్లీలో అద్దుకున్న కందిపొడి గొంతులో అడ్డుపడిందో!!!!!!

13 comments:

  1. హ హ్హ హ్హా భలే ఉన్నాయి మీ స్మృతులు. మొత్తానికి అందరి దగ్గరా మంచి మార్కులు కొట్టేశారు!

    ReplyDelete
  2. :) మీ వారిని తలుచుకుని నవ్వుకున్నామండీ .నిజానికి మీరు చేసిందే రైటు :):)

    ReplyDelete
  3. naakaite.. edo movie choosinattundi .. mee blog chaduvutunte.. internet vachaaka telugutanam poyindemo anukunnanu.. kaani mee lanti vaallu mammalni tatti leputunnaru..

    ReplyDelete
  4. మీరు వర్ణించకపోయినా థియేటర్లో మీవారి హావభావాలు కళ్ళముందు కనిపించాయి.. బాగుంది టపా...

    ReplyDelete
  5. పాపం మీ శ్రీవారు :)

    ReplyDelete
  6. ప్యాకెట్టు చేతులు మారి నా చేతిలోకి వచ్చే సరికి వెల రు.15 అనే నూనె కాగితము, తెరపై గ్రూప్ ఫోటోతో సినిమా అంతము.

    :):)

    ReplyDelete
  7. This comment has been removed by the author.

    ReplyDelete
  8. చాలా బాగా రాసారు:) నాకు 'పియా కా ఘర్ ' సినిమా గుర్తు వచ్చింది అది చదవగానే.
    మీ 'అబౌట్ మీ' లో మీ గురించి రాసుకున్నది చాలా భాగుంది.mee posts anni kooda baagunnai.

    ReplyDelete
  9. మీ మొదటి రెండు స్మృతులు చదివాను. వరంగల్ అనే సరికి నా స్మృతులు అన్నీ నన్ను పెనవేసుకుంటున్నాయి. ఎందుకంటే నా బాల్యం గడిచింది అక్కడే. ఆకారపు గుడికి ప్రక్కనే వున్న సుశీలా దేవి స్కూల్లో చదువుకుంటున్నప్పుడు మనస్సంతా ఇంటర్వెల్లో తినబోయే ప్రసాదం మీదే వుండేది.
    ఆంధ్రా నుండి వచ్చిన కొంతమంది మేస్టార్లు కృష్ణా కాలనీలో వుండే వాళ్ళు. చక్కటి గోదావరి భాష వినబడేది.వ్రాసుకుంటూ బోతే ఎన్నెన్నో!

    ReplyDelete
  10. ha ha...chaala navvukunna me tapaalu chaduvuthoo...mukhyam ee tapaa

    ReplyDelete
  11. చాలా చక్కగా వ్రాస్తున్నారు, నేను ఈరోజే మొదటిసారి మీ బ్లాగ్ చూసాను, అన్ని టపాలు ఏకబిగిన చదివేసాను ఒకేసారి, మీ రచనాశైలి చక్కని హాస్యంతో చాలా బాగుంది.

    ReplyDelete