Friday, May 15, 2009

మా సరిగంగ స్నానాలు.

మా పెళ్ళైన మొదటి సంవత్సరం మా అత్తగారు మాతో శివరాత్రికి గోదావరి నదిలో సరిగంగ స్నానాలు చేయించాలని తెగ సంబరపడి మమ్మల్ని రాజమండ్రి రమ్మని పిలిచారు. ఇద్దరం కలసి బయలుదేరే వీలులేక నేను వరంగల్ లో రైలు ఎక్కి ఆయనని విజయవాడలో కలిసి ఇద్దరం రాజమండ్రి వెళ్ళాలని అనుకున్నాము. ఇంతవరకు బాగానే వుంది.......నేను వరంగల్ లో రైలెక్కి బెర్త్ చూసుకుని ఎక్కి పడుకున్నాను, నిద్రపట్టేసింది ఎప్పుడు విజయవాడ వచ్చిందో తెలియలేదు. ఆయన అచివర నుండి ఈచివరి వరకు రైలంతా వెతికి చివరికి ఎక్కి కూర్చున్నారు.
నాకు బండి కొద్దిక్షణాలలో బయలుదేరుతుంది అనగా మెలుకువ వచ్చి, మావారి కోసం వెతికి ఆయన బహుశా ఈ బండి ఎక్కివుండరు అనుకుని క్రిందికి దిగి ప్లాట్ ఫారం మీద నేను ఆయనకోసం వెతుకుతుంటే..... ట్రైన్ బయలుదేరి చివరి బోగీ ప్లాట్ ఫారం వీడే సమయానికి ఆయన బోగీలో నన్ను వెతుకుతూ కనిపించారు, ఆయన నన్ను చూడలేదు నేను ఎక్కలేను.......ఎందుకని అనుకుంటున్నారా!!!..... రైలుబండి అప్పుడే మేల్కోని ఊపందుకుంది మరి. సమయం అర్థరాత్రి ఒంటిగంట కొట్టింది. ఏమి చేయాలో అని ఆలోచిస్తూ స్టేషన్ మాస్టర్ ని వేరే ట్రైన్ వుందేమో అని అడగడానికి వెళ్ళిన నాకు, తెల్లారేవరకు ట్రైన్ లేదని మీవారికి ఏలూరు స్టేషన్ లో మీరు ఇక్కడ వున్నట్టు మెసేజ్ అందించగలమని సలహా ఇచ్చారు. చేసేది లేక ఇలాగైనా ఆయనకి కాస్త టెన్షన్ తగ్గిద్దామని అనౌన్స్ చేయమ
న్నాను....అలా స్టేషన్ మాస్టర్ గారు సహాయం చేసి పుణ్యం కట్టుకున్నారు.
అనౌన్స్మెంట్ విన్న ఆయన ఏలూరు నుండి బయలుదేరి విజయవాడ వచ్చేసరికి ఉదయం నాలుగు గంటలు. మేము కలసి మళ్ళీ రైలెక్కి రాజమండ్రి ఇంటికి చేరుకునేసరికి...... అందరూ స్నానాలు చేసి ఇంటికి వచ్చి ఈసారి వీళ్ళు ఏ సాహాసకార్యం వెలగబెట్టారో అని ఎదురు చూస్తున్నారు......వాళ్ళ ఎదురుచూపులని నేను వమ్ము కానిస్తానా చెప్పండి!!!

3 comments:

  1. సృజన గారు, మీ టపాలు చదివాను.. చాలా చక్కగా రాస్తున్నారు.. క్రమం తప్పకుండా రాస్తూ ఉండండి.. మీ రచనా శైలి బాగుంది..

    ReplyDelete
  2. మురళీగారు..ధన్యవాదాలు! తప్పక ప్రయత్నిస్తాను.

    ReplyDelete
  3. చాలా బాగా రాసారు.ఇది చదువుతూంటే నాకు piyA kA ghar సినిమా గుర్తు వచ్చింది.మీ బ్లగులో అబౌట్ మీ లో మీరు రాసిన వాక్యం నిజంగా మనసుని తాకింది.

    ReplyDelete